Kavitha Padayatra: త్వరలో నా పాదయాత్ర ఉంటుంది.. ‘భైరవ’ బస్సులో రాష్ట్రవ్యాప్త పర్యటన.. చిట్ చాట్ లో కవిత ఆసక్తికర విషయాలు!

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విలేకరులతో జరిపిన చిట్ చాట్‌లో తన పాదయాత్ర (Kavitha Padayatra)గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kalvakuntla Kavitha interesting comments on padayatra and Bhairava bus yatra.

Kavitha Padayatra: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విలేకరులతో జరిపిన చిట్ చాట్‌లో పలు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాబోతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల గణేష్ నిమజ్జనంలో కేసీఆర్ పాటలకు డాన్సులు చేయమని డబ్బులు ఇచ్చి మరీ చేయించారని, అదంతా ఆ పార్టీ పెయిడ్ టీమ్ ఆడిన డ్రామా అని ఎద్దేవా చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఆయన ఒక ‘అట్టర్ ప్లాప్ సీఎం’ అని అభివర్ణించారు. తమ పార్టీ కొడంగల్ సభ అత్యంత ప్రాధాన్యతతో సక్సెస్ అయిందని, తాము ప్రజా సమస్యలపై మాట్లాడినప్పుడే ఈ ప్రభుత్వం స్పందించి చర్యలకు పూనుకుంటోందని కవిత స్పష్టం చేశారు.

Rapido Ownly: రాపిడో ‘ఓన్లీ’ ఫుడ్ డెలివరీ యాప్ లాంచ్.. ఇకపై ఎలాంటి ఛార్జీలు లేకుండానే.. ఈవెంట్ లో సందడి చేసిన నాని

ఎండాకాలంలో ‘భైరవ’ బస్సులో పాదయాత్ర – పవన్ కళ్యాణ్ ట్రోలింగ్‌పై కౌంటర్:

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు రాబోయే ఎండాకాలం నుంచి పాదయాత్రను(Kavitha Padayatra) ప్రారంభిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక బస్సు సిద్ధమవుతోందని, దానికి ‘భైరవ’ అని పేరు పెట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇక జనసేనాని, పవన్ కళ్యాణ్ టీమ్ కావాలనే సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తోందని, కానీ తాను వాటిని పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నానని చెప్పారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలు లేదా ప్రాంతంపై మాట్లాడితే, తాను కూడా ఖచ్చితంగా స్పందించి సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. అలాగే 2027 దసరా నాటికి బతుకమ్మ పండుగను గిన్నిస్ రికార్డులోకి ఎక్కించేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తామన్నారు.

రాబోయే ఎన్నికల్లో పోటీపై స్పష్టత – ఎమ్మెల్సీ స్థానాల్లో రాజకీయ వ్యూహాలు:

ముందున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు కవిత తెలిపారు. త్వరలో జరగనున్న ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా పోటీ చేస్తుందని పునరుద్ఘాటించారు. అంతేకాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని తెలిపారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానాల్లో తమ పార్టీ మద్దతు కావాలని పలువురు కోరుతున్నారని, అయితే దానిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.