kamareddy assembly constituency: కామారెడ్డి.. కాంగ్రెస్‌కు కంచుకోట. కానీ.. ఇప్పుడు కాదు. ఒకప్పుడు. ఇప్పుడు కామారెడ్డి అంటే.. బీఆర్ఎస్‌కు అడ్డా. ఇప్పటికే.. గులాబీ పార్టీ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో.. ఈసారి ఎదురుదెబ్బ తప్పదనే టాక్ వినిపిస్తోంది. దాంతో.. గంప గోవర్దన్‌కు టికెట్ దక్కుతుందా? లేదా? అనే చర్చ నడుస్తోంది. మిగతా పార్టీల్లోనూ.. ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ఈసారి.. గులాబీ కంచుకోటను బద్దలుకొట్టడం విపక్షాల వల్ల అవుతుందా? ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో నిలిచే అవకాశముంది? ఓవరాల్‌గా.. కామారెడ్డి సెగ్మెంట్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizambad district)లోని హాట్ సీట్లలో.. కామారెడ్డి ఒకటి. ఈ నియోజకవర్గం.. 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు.. 17 సార్లు ఎన్నికలు జరిగాయ్. ఈ సెగ్మెంట్‌లో.. ఆరు మండలాలున్నాయి. అవి.. కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ(Domakonda), బిన్నూరు, బీబీపేట్, రాజంపేట్. వీటి పరిధిలో మొత్తంగా 2 లక్షల 27 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. కామారెడ్డి ఒక జమానాలో కాంగ్రెస్‌కు కంచుకోట. తెలుగుదేశం(Telugu Desam Party) కూడా ఇక్కడ ఐదు సార్లు గెలిచింది. బీఆర్ఎస్ వరుసగా 3 సార్లు గెలిచింది. కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన షబ్బీర్ అలీ (Mohammad Ali Shabbir).. మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్దన్ (Gampa Govardhan).. కామారెడ్డి నుంచి ఐదు సార్లు గెలిచారు. వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. దీనిని బట్టే.. నియోజకవర్గంపై ఆయనకు ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు.
అదే సమయంలో.. ఆయనకు వ్యతిరేకత కూడా అంతే ఉందనే టాక్ వినిపిస్తోంది. కార్యకర్తలను దూరం పెట్టడంతో పాటు జనంతో ఆయన వ్యవహారశైలి, అధికారులతో దురుసుగా మాట్లాడటం లాంటి వాటితో.. ఆయనో వివాదాస్పద ఎమ్మెల్యే అనే ముద్ర పడిపోయింది. గత ఎన్నికల తర్వాత.. గంప గ్రాఫ్ పడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా.. మాస్టర్ ప్లాన్ రగడతో పాటు మున్సిపాలిటీల్లో పేదల భూముల్లో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయని.. రోడ్ల విస్తరణలో.. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనులు చేయించుకున్నారనే పేరుంది. ఇక.. డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదనే విమర్శలున్నాయ్. ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పుకుంటున్నారు.
గంప గోవర్దన్ (photo: facebook)
జిల్లా కేంద్రంగా ఉన్న కామారెడ్డిలో.. మౌలిక సదుపాయల కొరత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే.. ఎమ్మెల్యే గంప గోవర్దన్‌పై కొన్ని సామాజికవర్గాల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ చేసిన సర్వేల్లోనూ అదే తేలింది. దాంతో.. ఆయనకు టికెట్ డౌటేనన్న టాక్ వినిపిస్తోంది. అందువల్ల.. తనకు కాకపోతే తన కొడుకు శశాంక్ కైనా టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో గంప గోవర్దన్ ఉన్నారు. ఇప్పటికే.. గంప శశాంక్ (gampa shashank) నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
గంప శశాంక్ (photo: facebook)
మరోవైపు.. కామారెడ్డి బీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు కీలకంగా మారతాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఉన్న వ్యతిరేకతకు తోడు అంతర్గత కలహాలు ఎఫెక్ట్ చూపే చాన్స్ ఉంది. మరోవైపు.. బీఆర్ఎస్ టికెట్ రేసులో నిట్టు వేణుగోపాల్ (Nittu Venu Gopal Rao) కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయన కూతురు జాహ్నవి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్నారు. దాంతో.. వచ్చే ఎన్నికల్లో తనకు కాకపోతే.. కూతురికైనా టికెట్ దక్కేలా వేణుగోపాల్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ముజీబొద్దిన్‌ది మరో గ్రూప్. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగానూ ఆయన వ్యవహరిస్తున్నారు. దాంతో.. ముజీబ్‌కే టికెట్ వచ్చే చాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
షబ్బీర్ అలీ (photo: facebook)
కాంగ్రెస్ విషయానికొస్తే.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali) మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మైనార్టీ లీడర్‌గా, మాజీ మంత్రిగా, రెండు సార్లు ఓటమిపాలైన సానుభూతి కలిసొస్తుందని భావిస్తున్నారు షబ్బీర్ అలీ. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించడం, నిరసనలు చేపట్టడం, ముఖ్యంగా రైతు సమస్యలు, మాస్టర్ ప్లాన్‌పై ఆందోళనలు చేయడం ఆయనకు బాగా ప్లస్ అయింది. తనను గెలిపిస్తే.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తి చేసి.. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని చెబుతున్నారు.
Also Read: తనయుడి కోసం పోటీ నుంచి తప్పుకోనున్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. జూనియర్ జువ్వాడి సైతం..
కాటిపల్లి వెంకటరమణారెడ్డి (photo: facebook)
ఇక.. తెలంగాణలో బీజేపీ గట్టి పోటీనిచ్చే సెగ్మెంట్లలో కామారెడ్డి ఒకటిగా కనిపిస్తోంది. టికెట్ రేసులో కాటిపల్లి వెంకటరమణారెడ్డి (katipally venkata ramana reddy) ఉన్నారు. 60 రోజుల పాటు రైతుల తరపున మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అధికార పార్టీ నేతలు అమాయకుల భూముల కబ్జాలకు పాల్పడుతున్నారంటూ.. ప్రజాదర్బార్ నిర్వహించి ఇరకాటంలో పెట్టారు. కామారెడ్డికి కాళేశ్వరం జలాలు తెస్తామని చెప్పడం, విద్యాకేంద్రంగా మారుస్తామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తవలేదు. దాంతో.. రాబోయే ఎన్నికలు గంప గోవర్దన్‌కు.. అగ్ని పరీక్షలా మారతాయని బీజేపీ నాయకులు అంటున్నారు. కామారెడ్డిలో.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెబుతున్నారు.
Also Read: జగిత్యాలలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీకి దిగుతున్నారు.. పార్టీలు వేస్తున్న లెక్కలేంటి?
ఇక.. నిజామాబాద్, బోధన్ తరహాలోనే.. కామారెడ్డిలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. దాంతో.. మైనార్టీల ఓట్లు కూడా కీలకంగా ఉన్న సెగ్మెంట్‌లో బీజేపీ గెలుపు ఎంతవరకు సాధ్యమనే చర్చ జరుగుతోంది. అదేవిధంగా.. వైశ్యులు, మున్నూరుకాపు, గౌడ, ముదిరాజ్ సామాజికవర్గాల ఓట్ బ్యాంక్ కూడా కీలకమనే చెప్పాలి. ఇక.. అధికార పార్టీ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందనే దానిపై.. కామారెడ్డిలో గెలుపోటములు ఆధారపడి ఉన్నాయ్. అందువల్ల.. ఈసారి కామారెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.