karimnagar Jewellery robbery case : కరీంనగర్ జ్యువెల్లరీ షాపులో చోరీ వారిపనే.. నిర్ధారణకు వచ్చిన పోలీసులు..
karimnagar Jewellery robbery case : పీఎంజే జ్యూవెలరీ షాపులో చోరీకి పాల్పడింది బీహార్‌కు చెందిన బంగారం దొంగతనం చేసే ముఠా (Gold Thief Gang)గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నార్త్ ఇండియాలో దోపిడీలు, కిడ్నాప్ లు, అక్రమ వసూళ్లు చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ బంగారం దొంగతనం ముఠా దేశవ్యాప్తంగా నెట్వర్క్ నడుపుతున్నట్లు సమాచారం.
karimnagar Jewellery robbery case
- కరీంనగర్లో దోపిడీ కేసులో పురోగతి
- బీహార్ ముఠా సభ్యులుగా గుర్తించిన పోలీసులు
- ఐదుగురు కాదు.. ఆరుగురు ఉన్నట్లు అనుమానాలు
karimnagar Jewellery robbery case : కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాపులో దుండుగులు కాల్పులు జరిపి చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. భారీ మొత్తంలో బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నగల దుకాణంలో దోపిడీకి పాల్పడటానికి రెండు రోజుల ముందే ధర్మపురిలో మకాం వేసిన దొంగలు రెక్కి చేసి పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ఆధారాలను సేకరించారు. దుండుగులు వాడిన ద్విచక్ర వాహనాలు, హెల్మెట్ సైతం దొరికాయి. మరికొన్ని కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు దోపిడీకి పాల్పడింది వారేనని నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
పీఎంజే జ్యూవెలరీ షాపులో చోరీకి పాల్పడింది బీహార్‌కు చెందిన బంగారం దొంగతనం చేసే ముఠా (Gold Thief Gang)గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నార్త్ ఇండియాలో దోపిడీలు, కిడ్నాప్ లు, అక్రమ వసూళ్లు చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ బంగారం దొంగతనం ముఠా దేశవ్యాప్తంగా నెట్వర్క్ నడుపుతున్నట్లు గుర్తించారు. అయితే, పీఎంజే జ్యూవెలరీ షాపులో చోరీ చేసింది ఐదుగురు కాదు ఆరుగురుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆ ఆరో వ్యక్తే ఐదుగురు దొంగలను ఛత్తీస్ గడ్ లేదా ఝార్ఖండ్ తప్పించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
బీహార్ కు చెందిన ఈ ముఠాలో సభ్యులెవరనేది ప్రాథమికంగా పేర్లు, చిరునామాలతో పోలీసులు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీంతో వారిని పట్టుకునేందుకు హైదరాబాద్, కరీంనగర్ కు చెందిన దాదాపు ఆరు బృందాలు బీహార్ లో మకాం వేశాయి. దొంగల బంధువులు, సన్నిహితుల ఫోన్ నంబర్లపై నిఘా పెట్టి వారు ఏ ప్రాంతంలో దాగి ఉన్నారనే కోనణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ధర్మపురి విజయలక్ష్మీ లాడ్జిలో ఝార్ఖండ్‌కు చెందిన సౌరభ్ మిశ్రా గదిని ఈ గ్యాంగ్ అద్దెకు తీసుకుంది. అయితే, బీహార్ గ్యాంగ్ లోని ఇద్దరు సభ్యులు ఈ ఏడాది మార్చి 15న తొలిసారిగా పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జికి వచ్చినట్లు, మార్చి 22వరకు అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత అదే నెల 24వ తేదీన మళ్లీ ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. హార్వెస్టర్ కు సంబంధించిన మెకానిక్‌లమని లాడ్జి యాజమానిని నమ్మించారు. వీరు పరిస్థితులు గమనించిన తరువాత మిగతా ముఠా సభ్యులు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 27 నుంచి 30 వరకు పెద్దపల్లి పరమేశ్వర లాడ్జిలో వీరు బస చేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి మిగతా సభ్యులతో కలిసి ధర్మపురి వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. దోపిడీ తరువాత పోలీసులను తప్పుదోవ పట్టించేలా వారు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారని, అందుకే మహారాష్ట్రలో తయారయ్యే బ్యాగులను వాడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలాఉంటే.. బీహారీ ముఠా సభ్యులకు గతంలోనూ పలు బంగారు ఆభరణాల చోరీల్లో భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బంగారు ఆభరణాలే లక్ష్యంగా భారీ దోపిడీలు చేసే వీరు, చోరీ సొత్తును పంచుకుని వేరువేరు ప్రాంతాలకు తరలి వెళ్తారని సమాచారం. అన్ని కోణాల నుంచి ఈ కేసును విచారణ చేస్తున్న పోలీసులు త్వరలోనే దుండుగలను పట్టుకుంటామని చెబుతున్నారు.
