Venkaiah Naidu: మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి, పాకిస్తాన్ కుయుక్తులను తిప్పికొట్టాలి- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఇతరులపై దాడి చేసే ఉద్దేశ్యం మన దేశానికి లేదు. మన ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేశాం.

Venkaiah Naidu: కశ్మీర్ భారత దేశంలో అంతర్భాగం అని, దీనిపై ఎలాంటి చర్చలు లేవని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు. కులాలు, మతాలకు అతీతంగా మనమంతా కలిసి ఉండాలని, పాకిస్థాన్ కుయుక్తులను తిప్పి కొట్టాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో తిరంగా ర్యాలీలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. విలక్షణమైన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో మనం ఇక్కడ సమావేశం అయ్యామని ఆయన అన్నారు. తక్కువ సమయంలో శత్రువుల స్థావరాలను నాశనం చేశామన్నారు. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. అందరం ఐక్యమత్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత ఆర్మీకి మద్దతుగా దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగా ర్యాలీ నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. వివిధ రంగాల ప్రతినిధులు, ప్రజలు భారీగా హాజరయ్యారు.

”పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. విలక్షణమైన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో మనం ఇక్కడ సమావేశం అయ్యాం. తక్కువ సమయంలో శత్రువుల స్థావరాలను నాశనం చేశాం. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవాలి. భారత్ శాంతి దేశం. ఇతరులపై దాడి చేసే ఉద్దేశ్యం మన దేశానికి లేదు. మన ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేశాం. అందరం ఐక్యమత్యంగా ఉండాలి. కులాలు, మతాలకు అతీతంగా మనం కలిసి ఉండాలి. పాకిస్థాన్ కుయుక్తులను తిప్పి కొట్టాలి. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం. దీనిపై ఎలాంటి చర్చలు లేవు. కేవలం ఉగ్రవాదంపైన మాత్రమే పాకిస్థాన్ తో చర్చలు. వీర జవాన్లకు అభినందనలు” అని వెంకయ్య నాయుడు అన్నారు.

మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు..
తిరంగా యాత్రలో పాల్గొన్న అందరికీ అభినందనలు. ఈ ర్యాలీ చూస్తే పాకిస్తాన్ వణికిపోవడం ఖాయం. మనం ఏ దేశంపైనా దండయాత్ర చేయలేదు. ప్రపంచంలో వెలివేయబడిన వారిని మన భారత దేశం అక్కున చేర్చుకుంది. రతన్ టాటా లాంటి వారు ఇస్లాం టెర్రరిజం భయానికి పర్షియా నుండి వచ్చారు. తాజ్ గ్రూప్ హోటల్ పై టెర్రరిస్టులు దాడి చేస్తే తాజ్ హోటల్ నాశనమైనా పర్వాలేదు కానీ ఒక్క టెర్రరిస్ట్ కూడా బయటకు వెళ్లడానికి వీళ్లేదని రతన్ టాటా చెప్పారు. హైదరాబాద్ లో మన కార్యకర్తలు అనేక మంది స్లీపర్ సెల్స్ కు బలయ్యారు.

Also Read: దేశద్రోహులు..! భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం.. లేడీ యూట్యూబర్ సహా ఆరుగురు అరెస్ట్..

మహేశ్వర్ రెడ్డి, బీజేఎల్పీ లీడర్
భారత దేశం వైపు కన్నెత్రి చూస్తే ఎంతవరకైనా వెళ్తాం అనే సంకేతం ఇచ్చారు నరేంద్ర మోదీ. భారత ఆర్మీకి మద్దతుగా నిలిచి ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రధానికి కృతజ్ఞతలు.

ఈటల రాజేందర్.. మల్కాజిగిరి ఎంపీ
నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాన్ని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేశారు. నరేంద్రమోదీ తన దు:ఖాన్ని దిగమింగుతూనే సరైన గుణపాఠం చెప్పారు.

మాజీ లెఫ్టినెంట్ జనరల్ హరిప్రసాద్..
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కు ఊహించని నష్టం కలిగించాము. ఈ విజయం మనందరిది. కేవలం మూడు రోజుల్లో ఒక న్యూక్లియర్ దేశాన్ని నాశనం చేయడం గొప్పం విషయం. బోర్డర్ లో ఉన్న సైనికులకు అండగా ఉన్నామని మద్దతు తెలపడం గర్వంగా ఉంది.