పార్టీ, ఫ్యామిలీతో అంటీ ముట్టనట్లుగా కవిత తీరు.. బీసీ రిజర్వేషన్ల కోసం రైల్ రోకోకు పిలుపు.. మరి బీఆర్ఎస్ నుంచి మద్దతు?

ఇటువంటి సమయంలో కవిత నిర్వహిస్తున్న రైల్ రోకోకు బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తీరు కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆమె మాట్లాడుతున్న మాటలు, వేస్తున్న అడుగులకు ఎక్కడా పొంతన ఉండటం లేదన్న చర్చ జరుగుతోంది. తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్‌ అయినప్పటి నుంచి కవిత న్యూస్‌ హెడ్‌లైన్‌గా ఉంటున్నారు.

పార్టీ అధినేత కేసీఆర్ తీరునే ప్రశ్నించిన కవిత..తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌గా కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ.. కుటుంబంతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు కవిత. మధ్యలో కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్లిన రోజు ఫాంహౌస్‌లో ఆయన వెంట కనిపించి ట్విస్ట్ ఇచ్చారు. కట్‌ చేస్తే..తెలంగాణ జాగృతి పేరుతో యాక్టివిటీని స్పీడప్ చేసి బీఆర్ఎస్‌కు ఇండైరెక్టుగా సవాళ్లు విసురుతున్నారు కవిత.

Also Read: మరోసారి హాట్‌ టాపిక్‌గా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మిగిలిన మూడు బెర్తులు కూడా భర్తీ చేస్తారని టాక్

తెలంగాణ జాగృతి తరఫున బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 17న రైల్ రోకోకు పిలుపునిచ్చారు కవిత. డక్కన్ టు ఢిల్లీకి వెళ్లే రైళ్లను అడ్డుకుంటామంటున్న ఆమె..రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నారు. ఆర్.కృష్ణయ్యతో పాటు పలు రాజకీయ పార్టీల ఆఫీస్‌లకు వెళ్లి మరీ మద్దతు కోరారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా లేఖ రాస్తానంటున్నారు కవిత.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీనని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్న కవిత..రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలని సొంత పార్టీకి లేఖ రాయడమేంటన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్‌కు లేఖ ఎపిసోడ్ తర్వాత కవిత నిర్వహించిన ఏ కార్యక్రమానికి కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అటెండ్ కావడం లేదు. లాస్ట్‌కు కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులపై కవిత నిర్వహించిన ధర్నాకు కూడా కారు పార్టీ లీడర్లు వెళ్లలేదు. ఆ కార్యక్రమంలో ఎక్కడా గులాబీ జెండా కనిపించలేదు.

ఇటువంటి సమయంలో కవిత నిర్వహిస్తున్న రైల్ రోకోకు బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కవిత..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసినా అక్కడి నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవచ్చనే చర్చ జరుగుతోంది. రైల్ రోకోకు కూడా బీఆర్ఎస్ నుంచి ఎవ్వరూ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యనేతలే కాదు కార్యకర్తలు కూడా హాజరయ్యే అవకాశం లేదని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కవిత బీఆర్ఎస్‌లోనే ఉన్నారా? లేక సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారా? అన్నది పెద్ద క్వశ్చన్‌గా మారింది. రాబోయే రోజుల్లో ఆమె నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.