Kavitha: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. నేను మేడ్చల్ లో పూలు అమ్మినా, పాలు అమ్మినా అని చెప్పే మల్లారెడ్డి.. వేల ఎకరాలు కబ్జా చేశారని కవిత ఆరోపించారు. మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి కాలేజీలు, యూనివర్సిటీలు తప్పితే.. ప్రజలు బాగుపడింది లేదని విమర్శించారు. మేడ్చల్ నియోజకవర్గంలో అసలు అభివృద్ధే జరగలేదన్నారు.
”ఇవాళ మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటించాము. మేడ్చల్ నియోజకవర్గంలో నేను చాలా అభివృద్ధి చేశానని మాజీమంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఆయన ఒక టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక టర్మ్ ఎంపీగా ఉన్నారు, ఇంకో టర్మ్ మంత్రిగా ఉన్నారు. జవహర్ నగర్ కావొచ్చు, దమ్మాయిగూడ కావొచ్చు అన్ని ఏరియాలు తిరుగుతూ వచ్చాం. ఎక్కడ చూసినా.. మౌలికమైనటువంటి వసతులు తాగునీరు కానీ రోడ్లు కానీ స్కూళ్లు కానీ ఆసుపత్రులు కానీ ఏవీ లేవు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అన్నింటికన్నా దారుణం ఏంటంటే.. ఇంత పెద్ద మేడ్చల్.. దేశంలోనే పెద్ద ఎమ్మెల్యే నియోజకవర్గం అని చెప్పుకునే మేడ్చల్ లో, హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న మేడ్చల్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కావొచ్చు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కావొచ్చు తక్కువగా ఉన్నాయి. మొత్తానికి మొత్తం ప్రైవేట్ పరం అయిపోయింది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్ గా మారిపోయింది. గంజాయికి అడ్డాగా మారిపోయింది మొత్తం మేడ్చల్. తప్పితే అభివృద్ధివైపు అడుగులు వేసింది లేదు.
ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్ యార్డ్ సమస్య కొంతవరకు తీరింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక అది త్రిబుల్ అయ్యింది. రెండు మూడు గుట్టలయ్యాయి. నేను పాలమ్మినా, నేను పూలమ్మినా అని చెప్పే మల్లారెడ్డి.. పూలు, పాలు అమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా చేశారు. రోడ్డు విస్తరణకు అడ్డు పడుతున్నారు. వారి కాలేజీలు, యూనివర్సిటీలు తప్పితే ప్రజలు బాగుపడింది లేదు” అని నిప్పులు చెరిగారు కవిత.
Also Read: మా లక్ష్యాలు ఇవే: గ్లోబల్ సమిట్‌లో రేవంత్ రెడ్డి