Bandi Sanjay (Photo : Twitter)
Bandi Sanjay – CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు, అవినీతిపరులు జైలుకెళ్లటం ఖాయం అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. మహా జన్ సంపర్క్ అభియాన్ పబ్లిక్ మీటింగ్ లో బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
అవినీతిపరులను మోదీ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. అవినీతిపరులను జైలుకి పంపటం లేదని ప్రజలు, మీడియా పదే పదే అడుగుతున్నారని బండి సంజయ్ చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా.. అవినీతిపరులు జైలుకు పోవటం ఖాయమన్నారాయన. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరిన బండి సంజయ్.. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు.
మరోవైపు 25మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలోకి రావటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారన్న కేటీఆర్ కామెంట్స్ కు బండి ఇలా కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచటానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని బండి సంజయ్ అన్నారు. 30మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కు స్పాన్సర్ గా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. ధరణితో పేద ప్రజలు నాశనం అవుతున్నారని ఆయన వాపోయారు.
ధరణి పేదల పాలిట శాపం అన్నారు. ధరణి పోర్టల్ కి, రైతుబంధుకు సంబంధం ఏంటో కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ కానుందన్నారు. ఉపఎన్నికల్లో డిపాజిట్ రాని కాంగ్రెస్.. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని బండి సంజయ్ అడిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 2 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు.
బండి సంజయ్ హిందువుల గురించి బరాబర్ మట్లాడతాడని తేల్చి చెప్పారు. బీజేపీ వలనే కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు భాగ్యలక్ష్మీ దేవాలయం బాట పట్టారని కామెంట్ చేశారు. బీజేపీ వల్లే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సైతం భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్ళారని చెప్పారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఔట్ అయిందన్నారు. మోదీ తొమ్మిదేళ్ళ పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే బీజేపీ కార్యాలయాలు ఉన్నాయన్నారు బండి సంజయ్.