మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు స్వల్ప ప్రమాదం జరిగింది. తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ తుంటి విరిగిందని వైద్యులు గుర్తించారు. అంతే కాకుండా, ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబడిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎర్రవల్లిలోని తన ఫాం హౌజ్ కి వెళ్లిపోయారు. ప్రభుత్వ వాహనాలు వదిలేసి, ఎలాంటి ఆర్భాటం లేకుండా తన సొంత కారులో వెళ్లారు. గత మూడు రోజులుగా ఆయన ప్రజలను కలుస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవల్లిలోని ఫాం హౌజ్ కి వచ్చి కేసీఆర్ ని కలుస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా క్యూ కడుతున్నారు.
ఇక, ప్రగతి భవన్ ముందున్న గ్రిల్స్ ను తొలగిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పనులు ప్రారంభం కావడం గమనార్హం. అంతే కాకుండా, అప్పట్లో సీఎం క్యాంప్ ఆఫీసులో నూతన భవనం నిర్మించి దానికి ప్రగతి భవన్ అని కేసీఆర్ పేరు పెట్టారు. అయితే దానికి మహాత్మ ఫూలే ప్రజా భవన్ అని పేరు మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.