Hyderabad metro
Telangana Government : మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేడయంతో పాటు, మెట్రో విస్తరణ, ఎయిర్ పోర్టు అభివృద్ధి ఇలా అనేక కీలక విషయాలపై తెలంగాణ మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూ. 69,100 కోట్ల వ్యయంతో నగరం నలుదిశలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం అనుకున్న విధిగా మెట్రో మార్గాలు పూర్తయితే భాగ్యనగరంలో నలువైపులా వేగంగా మెట్రోలో సులభతరమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. భాగ్యనగరంలో ఇప్పటికే రెండు దశల్లో మెట్రో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు 69 కిలో మీటర్లు పొడవు ఉంది. ఎయిర్ పోర్టు మెట్రో పూర్తయితే 105 కిలో మీటర్లకు చేరుతుంది. తాజాగా మూడో దశలో రూ.69,100 కోట్లతో సుమారు 278 కిలోమీటర్లు పొడువున మహామెట్రో నిర్మాణానికి రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మెట్రోకాకుండా మూడో దశలో కొత్తగా ఎనిమిది మార్గాలతో పాటు అవుటర్ వెంట మరో నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించనున్నారు.
KTR: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఖరారు చేశాం.. ఇద్దరి పేర్లు చెప్పిన కేటీఆర్
మొత్తం తొమ్మిది మార్గాలో..
వచ్చే నాలుగేండ్లలో కొత్తగా నగరం నలువైపులా మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం తొమ్మిది మార్గాల్లో మెట్రో నిర్మాణం జరగనుంది. ఇస్నాపూర్ – మియాపూర్, మియాపూర్ – లక్డీకపూల్, ఎల్బీనగర్ – పెద్ద అంబర్ పేట, ఉప్పల్ – బీబీ నగర్, ఉప్పల్ – ఈసీఐఎల్, ఎయిర్ పోర్టు – కందుకూరు(ఫార్మాసిటీ), శంషాబాద్ – షాద్ నగర్ మార్గాల్లో ఈ మెట్రో నిర్మాణంకు ప్రభుత్వం నిర్ణయించింది. జేబీఎస్ – తూంకుంట, ప్యాట్నీ – కండ్లకోయ ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ (రెండు అంతస్తుల వంతెనలు) నిర్మిస్తారు. ఒక వంతెనను మెట్రో రైలుకు, మరో వంతెనను వాహనాలకు కేటాయిస్తారు.
KTR: ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం… తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం
మూడో దశ -ఏలో..
– బీహెచ్ఈఎల్ – పటాన్ చెరు -ఇస్నాపూర్ కారిడార్లో 13 కిలో మీటర్లు, ఎనిమిది స్టేషన్లు. అంచనా వ్యయం 3,250 కోట్లు.
– ఎల్బీనగర్ – హయత్ నగర్ – పెద్ద అంబర్ పేట కారిడార్‌లో 13 కిలో మీటర్లు, ఎనిమిది స్టేషన్లు. అంచనా వ్యయం 3,250 కోట్లు.
– శంషాబాద్ జంక్షన్ – కొత్తూరు – షాద్ నగర్ కారిడార్‌లో 28కిలో మీటర్లు, ఆరు స్టేషన్లు. అంచనా వ్యయం 6,800 కోట్లు.
– ఉప్పల్ – ఘట్ కేసర్ – బీబీనగర్ కారిడార్‌లో 25 కిలోమీటర్లు, 10 స్టేషన్లు. అంచనా వ్యయం 6,900 కోట్లు.
– శంషాబాద్ ఎయిర్ పోర్టు – తుక్కుగూడ ఓఆర్ఆర్ – మహేశ్వరం ఎక్స్ రోడ్డు – కందుకూర్ కారిడార్‌లో 26 కిలో మీటర్లు, ఎనిమిది స్టేషన్లు. అంచనా వ్యయం 6,600 కోట్లు.
– తార్నాక – ఈసీఐఎల్ ఎలివేటెడ్ మెట్రో ఎనిమిది కిలో మీటర్లు, ఐదు మెట్రో స్టేషన్లు. అంచనా వ్యయం రూ.2,300 కోట్లు.
మూడో దశ-బి (ఓఆర్ఆర్ మెట్రో కారిడార్)
– ఓఆర్ఆర్ శంషాబాద్ జంక్షన్ -తుక్కుగూడ – బొంగుళూరు – పెద్ద అంబర్‌పేట్ జంక్షన్‌లో 40 కిలో మీటర్లు, ఐదు మెట్రో స్టేషన్లు. అంచనా వ్యయం రూ.5,600 కోట్లు.
– ఓఆర్ఆర్ పెద్ద అంబర్ పేట – ఘట్‌కేసర్ – శామీర్‌పేట – మేడ్చల్ జంక్షన్ వరకు 45 కిలో మీటర్లు, ఐదు మెట్రో స్టేషన్లు. అంచనా వ్యయం రూ. 6,750 కోట్లు.
– ఓఆర్ఆర్ మేడ్చల్ – దుండిగల్ – పటాన్ చెరు వరకు 29 కిలోమీటర్లు, మూడు మెట్రో స్టేషన్లు. అంచనా వ్యయం రూ.4,785 కోట్లు.
– ఓఆర్ఆర్ పటాన్ చెరు – కోకాపేట – నార్సింగి జంక్షన్ వరకు 22 కిలో మీటర్లు, మూడు మెట్రో స్టేషన్లు. అంచనా వ్యయం రూ. 3,675 కోట్లు.
– బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు 26 కిలో మీటర్లు మూడు మెట్రో స్టేషన్లు. అంచనా వ్యయం రూ. 9,100 కోట్లు.
మూడో దశ-సీ (ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్)
– జీబీఎస్ – తూంకుంట మార్గంలో 17 కిలో మీటర్లు, 13 మెట్రో స్టేషన్లు. అంచనా వ్యయం రూ.5,690 కోట్లు.
– ప్యారడైజ్ జంక్షన్ – కొంపల్లి – కండ్లకోయ 12 కిలో మీటర్లు 10 మెట్రో స్టేషన్లు. అంచనా వ్యయం రూ. 4,400 కోట్లు.
– రాయదుర్గం – శంషాబాద్ ఎయిర్ పోర్టు 31 కిలో మీటర్లు, తొమ్మిది స్టేషన్లు. అంచనా వ్యయం రూ.6,250 కోట్లు.