Kidnapping scandal in Bowenpally : హైదరాబాద్ బోయిన్‌పల్లిలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. హాకీ మాజీ ప్లేయర్ ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులు కిడ్నాప్‌నకు గురయ్యారు. ప్రవీణ్‌రావుతో పాటు.. ఆయన సోదరులు నవీన్‌రావు, సునీల్‌రావును గుర్తు తెలియని దుండగులు రాత్రి కిడ్నాప్ చేశారు. మూడు వాహనాల్లో వచ్చిన దుండగులు… ముగ్గురిని ఆ వాహనాల్లోనే కిడ్నాప్ చేశారు. ముగ్గురికి సంబంధించిన విలువైన వస్తువులు, ల్యాప్‌టాప్‌ను ఎత్తు కెళ్లారు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇది జరిగినట్టుగా తెలుస్తోంది.
హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు ఈ కిడ్నాప్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు… సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావును సురక్షితంగా తీసుకొచ్చారు. ముగ్గురిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
కిడ్నాప్ అంతా సినీ ఫక్కీలో జరిగింది. పక్కా ప్లాన్‌తోనే ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ రావు ఇంట్లోకి వెళ్లాలంటే టైట్ సెక్యూరిటీ ఉంటుంది. దీంతో దుండగులు… ఇంట్లోకి వెళ్లడానికి పక్కా స్కెచ్ వేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమంటూ ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే తయారు చేసుకున్న నకిలీ ఐడీ కార్డులు చూపారు. ఇంట్లోకి వెళ్తూనే అక్కడ ఉన్న విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్స్ లాగేసుకున్నారు. ఆ తర్వాత ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావును బలవంతంగా ఓ రూమ్‌లో బంధించారు. ఇతర కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్‌రావుతోపాటు ఆయన ఇద్దరు సోదరులను కిడ్నాపర్స్ తమ వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించారు. ఎందుకంటూ నిలదీస్తున్నా వినిపించుకోలేదు. విచారించాలంటూ కార్లలోకి ఎక్కించి.. అక్కడి నుంచి మూడు వాహనాలతో పారిపోయారు. ఇదంతా కేవలం మూడు నాలుగు నిమిషాల్లోనే జరిగినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు.
తమ వారిని ఎక్కడ విచారిస్తున్నారో తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు మాత్రం తమకు సంబంధంలేదని… తాము అక్కడికి రాలేదని స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యుల్లో కలవరం మొదలైంది. తమవారిని ఎవరు తీసుకెళ్లారని ఆందోళన చెందారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. తమ వారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు హుటాహుటిన ప్రవీణ్‌రావు ఇంటికి వెళ్లారు.
జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే కిడ్నాపర్స్ కోసం సెర్చింగ్ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా వారు ఎటువైపు వెళ్లిందన్న దానిపై కూపీ లాగారు. అనంతరం యాక్షన్‌లోకి దిగిన పోలీసులు… కిడ్నాపర్లకు చెందిన మూడు వాహనాల్లో రెండింటిని పట్టుకున్నారు. ఈ వాహనాల్లో ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. చంద్రబోస్ అనే కీలక నిందితుడు పోలీసుల అదుపులోఉన్నాడు. దీంతో అతడి నుంచి కిడ్నాప్‌నకు సంబంధించిన పూర్తి వివరాలపై కూపీ లాగారు.
మరోవైపు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రవీణ్‌రావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. భయపడవద్దని… నిందితులను పట్టుకుంటామంటూ వారికి ధైర్యం చెప్పారు. ఎవరితోనూ తమకు విభేదాలు లేవని… తమ వారిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారికి ఎలాంటి హానీ తలపెట్టకుండా చూడాలని పోలీసులను కోరారు. కిడ్నాపర్లు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పేరుతో బెదిరింపులకు పాల్పడినట్టు వారు పోలీసులకు తెలిపారు. కీలక నిందితుడిగా అనుమానిస్తున్న చంద్రబోస్.. భార్గవ్ రామ్ సోదరుడే అని పోలీసు విచారణలో తేలింది..
కిడ్నాపర్లు భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పేరు చెప్పడంతో నార్త్‌జోన్ పోలీసులు రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్‌లోని అఖిలప్రియ నివాసానికి వెళ్లారు. అయితే భార్గవ్‌రామ్ మాత్రం ఇంటి తలుపులు ఓపెన్ చేయలేదు. రాత్రంతా కిడ్నాపర్ల కోసం సెర్చ్ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. మొత్తానికి కిడ్నాపైన ముగ్గురిని రక్షించారు. కిడ్నాపర్ల చెర నుంచి ముగ్గురిని సేఫ్‌గా తీసుకొచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాపైన ముగ్గురు సేఫ్‌గా ఇంటికి తిరిగొచ్చినా.. వీరి కిడ్నాప్‌పై నెలకొన్న సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి. వీరిని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కిడ్నాప్ వెనుక దాగున్న అసలు కథ ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. పోలీసులుగానీ… అటు కుటుంబ సభ్యులుగానీ…. కిడ్నాప్ వెనుక దాగున్న గుట్టు ఏంటో చెప్పడం లేదు.