Kishan Reddy : కాంగ్రెస్ అన్యాయం చేసిందని బీజేపీని ఆదరించారు, మీ రిటర్న్ గిఫ్ట్ అవసరం లేదు- కిషన్ రెడ్డి

ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడును అసెంబ్లీ, కౌన్సిల్ లో వినిపిస్తాం.

Kishan Reddy

Kishan Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతతలు తెలిపారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ గెలుపు తెలంగాణ సమాజానికి అంకితం చేస్తున్నామన్నారు. బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చూశారని కిషన్ రెడ్డి అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే నరేంద్ర మోదీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకున్నారని చెప్పారు. ఇప్పుడు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు చోట్ల గెలిపించారని పేర్కొన్నారు.

”కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిందని ప్రజలు బీజేపీని ఆదరించారు. ఇప్పుడు బీజేపీపై మరింత బాధ్యత పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత హామీలు అమలు చేయకుండా ఎదురు దాడి చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పదేళ్లు ముఖ్యమంత్రిగా నేనే ఉంటా.. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం.. అన్న కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారు ప్రజలు.

Also Read : బీఆర్ఎస్‌ కొత్త గేమ్‌.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలనమేనా ?

ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడును అసెంబ్లీ, కౌన్సిల్ లో వినిపిస్తాం. తెలంగాణ ప్రజలు మరింతగా పోరాటం చేయాలి. వారి సమస్యలపై నిలదీసే బాధ్యత మాకిచ్చారు. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి పోరాటాలకు సిద్ధమవుతాము. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ప్రజల సమస్యలు పోతాయి. సేవ్ తెలంగాణ – సపోర్ట్ బీజేపీ పేరుతో ప్రజల్లోకి వెళ్తాం. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి.

మేము తెలంగాణ ప్రజల మద్దతుతో గెలిచాం. మాకు ఏ పార్టీ మద్దతు లేదు. ఒకరి కోసం ఒకరు కలిసి పని చేసిన చరిత్ర వారిది. తెలంగాణ ప్రజల ఆలోచనను అర్థం చేసుకోకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. పనికి రాని ఆరోపణలకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మాకు కాంగ్రెస్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అవసరం లేదు. మాకు తెలంగాణ ప్రజలు ఇచ్చే గిఫ్ట్ సరిపోతుంది. ఓడిన మూడు ఉమ్మడి జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం. మేము కూడా కొన్ని తప్పులు చేశాం, వాటిని సరిదిద్దుకుంటాం” అని కిషన్ రెడ్డి అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా.. ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు.

ఈ రెండు చోట్ల సిటింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై గెలుపొందారు.

Also Read : రేవంత్‌ భారీ స్కెచ్‌.. జానారెడ్డికి కీలక పదవి? రేవంత్‌కు జానారెడ్డి బలం కాబోతున్నారా ?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. త్వరలోనే బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. తాము బీజేపీకి ఎన్నో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామన్న ఆయన తొందరలోనే మరొకటి ఇస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని ఓడించాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది మరోసారి వెల్లడైందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.