MLC Election: బీఆర్ఎస్‌ కొత్త గేమ్‌.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలనమేనా ?

మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్ధులను రంగంలోకి దింపితే మాత్రం.. రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారే చాన్స్ ఉంది.

MLC Election: బీఆర్ఎస్‌ కొత్త గేమ్‌.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలనమేనా ?

BRS Chief KCR

Updated On : March 6, 2025 / 7:53 PM IST

ఒకటి ముగిసింది.. మరొక దానికి రంగం సిద్ధమైంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సీక్వెల్‌ నడుస్తోంది. గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం రెండూ దెబ్బతినగా… ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఐదుస్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుందా… పోరు తప్పదా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఇందులో బీఆర్‌ ఎస్‌ తీసుకోబోయే స్టాండ్‌ ఇప్పుడు కీలకంగా మారింది. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా.. ఒక్క ఎమ్మెల్సీని ఈజీగా గెలుచుకునే అవకాశం బిఆర్‌ ఎస్‌ కు ఉండగా… రెండో అభ్యర్థిని కూడా బరిలో దింపితే ఎలా ఉంటుందని గులాబీ అధినేత భావిస్తున్నారట. అసలీ ఆలోచన బిఆర్‌ ఎస్‌ ఎందుకు చేస్తోంది… ఈ వ్యూహంతో ఎవరిని చిత్తు చేయాలన్నది గులాబీబాస్‌ గేమ్‌ ప్లాన్‌…

తెలంగాణలో టీచర్స్, గ్రాడ్యుయేట్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయ్. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఈనెల 10 వరకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు చాన్స్ ఉంది. నిజానికి ఎలాంటి పోటీ లేకుండా.. ఎలాంటి టెన్షన్‌ లేకుండా జరగాల్సిన ఎన్నికలు ఇవి.

రాజకీయ యుద్ధం
అలాంటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ వ్యవహారం.. ఇప్పుడు రాజకీయ యుద్ధానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. అధికార కాంగ్రెస్‌పై.. విపక్ష బీఆర్ఎస్ మైండ్‌ గేమ్‌ పాలిటిక్స్‌ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలోని 5ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయ్.

ప్రస్తుత అసెంబ్లీలో పార్టీల బలాల ఆధారంగా కాంగ్రెస్‌కు సొంతంగా నాలుగు దక్కించుకునే బలం లేదు.. అలా అని బిఆర్‌ ఎస్‌ కు రెండు గెలుచుకునే ఛాన్స్‌ లేదు. ఒకే అభ్యర్థిని బిఆర్‌ ఎస్‌ బరిలో దింపితే…కాంగ్రెస్‌ నలుగురిని దింపడం ద్వారా ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ఛాన్స్‌ ఉంది. అయితే కాంగ్రెస్‌ను టెన్షన్‌ పెట్టేందుకు కారు పార్టీ పావులు కదుపుతుందనే టాక్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించింది కారు పార్టీ. అయితే కొద్దిరోజులకే కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో.. ఉపఎన్నిక జరగగా.. ఆ సీటు కాంగ్రెస్‌ ఖాతాలో చేరింది. దీంతో అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 38కి తగ్గింది. ఇక పది మంది ఎమ్మెల్యేలు కారు దిగి.. కాంగ్రెస్‌లో చేరిపోయారు.

దీంతో అసెంబ్లీలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల బలం 28కు పరిమితం అయింది. కాంగ్రెస్‌ నలుగురిని… బిఆర్‌ ఎస్‌ ఒక్కరిని బరిలో దింపితే ఎన్నిక ఏకగ్రీవం అవుతోంది. అలా కాకుండా బిఆర్‌ ఎస్‌ ఇద్దరిని బరిలో దింపితే మాత్రం అప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానానికి 20మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి. ఇక్కడే బీఆర్ఎస్ మైండ్‌గేమ్ ఆడేందుకు రెడీ అవుతోంది.

ఒక్క ఎమ్మెల్సీ గెలుచుకునే బలమే ఉన్నా.. రెండో స్థానానికి కూడా పోటీ చేస్తే ఎలా ఉంటుందని కారు పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి.. పది మంది ఎమ్మెల్యేలు ప్రపోజ్‌ చేసి సంతకాలు పెట్టాలి. ఈ లెక్కన బీఆర్‌ఎస్‌కు ఉన్న 28 ఎమ్మెల్యేల బలం ప్రకారం… ఇద్దరు అభ్యర్థులు నామినేషన్స్‌ వేయొచ్చు.

కాంగ్రెస్‌ మీద ఒత్తిడి పెంచాలని ప్లాన్
ఐతే గెలవాలంటే మాత్రం.. ఒక్కరికి సరిపడా బలం మాత్రమే ఉంది. ఇక్కడే పొలిటికల్ మైండ్‌ గేమ్‌కు తెరలేపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్దులు నామినేషన్‌ వేయడానికి ఇబ్బంది లేకపోవడంతో.. అలానే చేద్దాం, అలా చేస్తే నష్టమేమీ లేదని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. రెండో ఎమ్మెల్సీ స్థానం గెలవకపోయినా సరే.. ఇద్దరు అభ్యర్ధులతో నామినేషన్‌ వేయించి.. కాంగ్రెస్‌ మీద ఒత్తిడి పెంచాలని తెలుస్తోంది.

ఇద్దరు అభ్యర్ధులను పోటీ చేయించడం ద్వారా. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను కూడా ఇరుకున పెట్టొచ్చని కారు పార్టీ ప్లాన్‌గా తెలుస్తోంది. పోలింగ్ అనివార్యమైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తే… కొంత వరకు వారిపై ఒత్తిడి ఉంటుందని భావిస్తోంది కారు పార్టీ. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా.. ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా సాక్ష్యం దొరుకుతుందన్న ఆలోచనలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు.

మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్ధులను రంగంలోకి దింపితే మాత్రం.. రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారే చాన్స్ ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్‌ కూడా ఎత్తుకు పై ఎత్తు వేస్తామని హెచ్చరిస్తోంది. బిఆర్‌ ఎస్‌ ఇద్దరు అభ్యర్ధులను దింపితే… తాము ఐదో అభ్యర్ధిని దింపుతామని హెచ్చరిస్తోంది. బిఆర్‌ ఎస్‌ నుండి క్రాస్‌ ఓట్‌ చేసేందుకు చాలామంది ఎమ్మెల్యేలు రెడీ గా ఉన్నారంటూ మైండ్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసింది. ఏదేమైనా బిఆర్‌ ఎస్‌ ఒక్కదానితో సరిపెట్టుకుంటుందా…రెండో సీటు కోసం పోటీ పడుతుందా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.