Kishan Reddy: భూములు అమ్ముకోడానికే 22A.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న భూ విధానాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- V Santhosh Kumar
- Published on- September 5, 2026 / 04:43 PM IST
Kishan reddy slams revanth reddy govt over 22a land regulations and monetization
- భూములు అమ్మడమే రేవంత్ లక్ష్యం
- 60 లక్షల ఎకరాలపై ఆంక్షలు
- 22ఏ జాబితాపై భాజపా పోరాటం
Kishan Reddy: హైదరాబాద్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న భూ విధానాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిషేధిత భూసమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలోని భూములను అమ్మడమే ప్రధాన లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజల ఆస్తులను దోచుకోవడానికే 22ఏ జాబితాను ఆయుధంగా వాడుకుంటోందని మండిపడ్డారు.
22ఏ నిబంధనలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం:
రాష్ట్రంలో అన్ని అనుమతులు ఉన్న భూములను సైతం ప్రభుత్వం కావాలనే 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిందని కిషన్‌రెడ్డి(Kishan Reddy) దుయ్యబట్టారు. దాదాపు 60 లక్షల ఎకరాలకు పైగా భూములను ఈ జాబితాలో పెట్టడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని ‘ఆర్ఆర్ రియల్ ఎస్టేట్’ సంస్థగా మార్చేశారని, భూములు అమ్మకపోతే ప్రభుత్వానికి రోజువారీ పాలన, ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. వక్ఫ్ భూములను మినహాయించి మిగిలిన అన్ని భూములపై రేవంత్ ప్రభుత్వం కన్ను వేసిందని విమర్శించారు.
బాధితులకు అండగా పోరాటం.. కాంగ్రెస్ అక్రమాలపై భాజపా హెచ్చరిక!
కాంగ్రెస్ నాయకులు, అధికారులు 30 శాతం కమీషన్ల కోసమే పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ దోచుకున్న ప్రతి రూపాయిని వసూలు చేసి తిరిగి ప్రజలకే పంచుతామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో 22ఏ సమస్యపై ఇంటింటికీ వెళ్లి చైతన్యం తెస్తామని, పేదల భూములను ఈ జాబితా నుండి తొలగించే వరకు భాజపా పోరాటం ఆపదని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
