Kodangal Constituency: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా.. నరేందర్ రెడ్డే మళ్లీ సత్తా చాటతారా?

రేవంత్ రెడ్డి కూడా కొడంగల్‌పై ఫోకస్ పెంచారు. ఈసారి.. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. ఇక.. బీజేపీకి కొడంగల్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది.

Kodangal Assembly Constituency Ground Report

Kodangal Assembly Constituency: తెలంగాణలోని హాట్ సీట్లలో కొడంగల్ ఒకటి. ఇక్కడి రాజకీయం.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగానూ, అందరి దృష్టిని ఆకర్షించే విధంగానే ఉంటుంది. పైగా.. కొడంగల్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సొంత నియోజకవర్గం కావడంతో.. అందరి ఫోకస్ ఇప్పుడు దీనిమీదే ఉంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా.. ఓడిన చోటే మళ్లీ గెలవాలనే ఆలోచనతో ఉన్నారు రేవంత్. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కొడంగల్ నుంచే మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. కొడంగల్ రాజకీయాలు హీటెక్కుతున్నాయ్. మరి.. గత ఎన్నికల్లో తనను ఓడించిన పట్నం నరేందర్ రెడ్డిని (Patnam Narender Reddy) ఈసారి రేవంత్ ఓడిస్తారా? కొడంగల్‌లో కీలకంగా ఉన్న ఓ నేత రేవంత్ వైపు వస్తారా? ఈసారి కొడంగల్‌లో కనిపించబోయే సీనేంటి?

కొడంగల్.. ఈ పేరు చెప్పగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే గుర్తొస్తారు. అలాంటి చోట.. రేవంత్‌కు చెక్ పెట్టి మరీ.. ఏమాత్రం అంచనాలకు అందకుండా.. గెలుపు జెండా ఎగరేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. మరి.. ఈసారి అక్కడ ఎవరు గెలుస్తారనేది.. హాట్ టాపిక్‌గా మారింది. కొడంగల్‌పై.. రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా? లేక పట్నం నరేందర్ రెడ్డే.. మరోసారి గెలిచి.. సత్తా చాటుతారా? అన్నది.. ఆసక్తి రేపుతోంది.

Patnam Narender Reddy

కొడంగల్‌లో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసే ముందు.. అక్కడి పొలిటికల్ సినారియో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తొలిసారి.. 2018 ఎన్నికల్లో.. కొడంగల్ ప్రజలు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలున్నాయి. అవి.. బొంరాస్‌పేట్, దూద్యాల్, దౌల్తాబాద్, కోస్గి, కొత్తపల్లి, గుండుమాల్, మద్దూర్. వీటన్నింటి పరిధిలో కలిపి.. మొత్తం 2 లక్షల 16 వేల మందికిపైనే ఓటర్లున్నారు. మొదట్నుంచి.. తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతంగా కొడంగల్‌కు పేరుంది. రాష్ట్రానికి మారుమూలన ఉండే ఈ ప్రాంతం.. ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.

ఇక్కడ రాజకీయాల విషయానికొస్తే.. మిగతా ప్రాంత రాజకీయాల కంటే భిన్నంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కొడంగల్‌లో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. సీన్ మారింది. 2014లో టీడీపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం మారింది. గత ఎన్నికల నుంచి.. కొడంగల్‌ రాజకీయం.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోయింది. ముందు నుంచీ.. ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యే ఉంటూ వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ నెలకొంది. 9 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో.. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఈసారి కూడా వాళ్లిద్దరి మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రెండు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమైపోయాయి.

Revanth Reddy

టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. స్టేట్‌తో పాటు కొడంగల్ పైనా ఫోకస్ పెట్టారు. వరుసగా.. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ.. క్యాడర్‌ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా కమిటీలు పటిష్టం చేసుకుంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నాలను హస్తం పార్టీ ముమ్మరం చేసింది. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. ఇందుకు ఇప్పట్నుంచే కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేసేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే.. బొంరాస్‌పేట మండలం మదనపల్లిలో.. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం.. ఎన్నికల ప్రచారం మాదిరిగా సాగింది. గతంలోనూ తన ఎన్నికల ప్రచారాన్ని.. మదనపల్లి నుంచే ప్రారంభించారు రేవంత్. ఆయనకు.. ఆ విలేజ్‌ని సెంటిమెంట్‌గా భావిస్తారు. కొడంగల్‌లో కాంగ్రెస్ గెలిచి తీరాలన్నారు.

Also Read: ఆసక్తికరంగా తాండూరు రాజకీయం.. ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు!

ఇక.. కొడంగల్ మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డితోనూ ఇటీవల రేవంత్ భేటీ అయ్యారు. ఈ అనూహ్య పరిణామంతో.. లోకల్ పాలిటిక్స్‌లో అలజడి మొదలైంది. బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్న నాయకుడితో.. రేవంత్ భేటీ వెనుక కారణాలేంటనే చర్చ మొదలైంది. రేవంత్ మర్యాదపూర్వకంగానే కలిశానని చెబుతున్నా.. ఎన్నికల నాటికి గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. హస్తం పార్టీ నుంచి ఎలాగూ రేవంత్ బరిలో దిగుతారు కాబట్టి.. బీఆర్ఎస్‌పై గుర్రుగా ఉన్న గుర్నాథ్‌రెడ్డిని.. తనతో కలుపుకు వెళ్లాలనే ఆలోచనతో రేవంత్ ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. ఆయనతో భేటీ అయ్యారని చెబుతున్నారు. అంతేకాదు.. కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డితో పాటు ఎంపీపీ ముద్దప్ప, ఇంకొందరు గుర్నాథ్ రెడ్డి అనుచరులు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుర్నాథ్ రెడ్డి.. తాను స్థానిక నాయకుడినని.. తనకే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి.. ఇద్దరూ నాన్ లోకల్ నాయకులనే ఫీలింగ్‌లో కొడంగల్ ప్రజలున్నారని.. తనకు పార్టీ టికెట్ ఇస్తే.. కచ్చితంగా గెలిచి తీరతానని గుర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మంథనిలో కాంగ్రెస్ ధీమా.. మరో చాన్స్ ఇవ్వమంటున్న మధు.. బీజేపీ పరిస్థితి ఏంటి?

మరోవైపు.. బీఆర్ఎస్ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.. అన్ని గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. తాను కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపించానంటున్నారు పట్నం నరేందర్ రెడ్డి. 80 శాతం బీటీ రోడ్లు పూర్తి చేశామని.. 40 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు. కావాలనే కొందరు రాజకీయం చేస్తున్నారని చెప్పారు. కచ్చితంగా మరోసారి కొడంగల్ గడ్డపై.. గులాబీ జెండా ఎగరేస్తామనే ధీమాతో ఉన్నారు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి.. నియోజకవర్గ సమస్యలను గాలికొదిలేసి.. మళ్లీ కాంగ్రెస్‌ని గెలిపించాలని కొడంగల్‌లో తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి తనపై పోటీ చేస్తే.. తన గెలుపు ఇంకా సులువు అవుతుందని పట్నం నరేందర్ రెడ్డి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇంకా.. కొడంగల్ ప్రజలు రేవంత్‌ని నమ్మే పరిస్థితులు లేవని.. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్

Also Read: నారాయణఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ.. హస్తం పార్టీలో గ్రూపు రాజకీయాలు..

కొడంగల్ టికెట్ తనకే వస్తుందనే ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నారు. కానీ.. అధికార పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇందుకు.. గతంలో ఆయన డీసీసీబీ ఛైర్మన్ పదవి ఆశించినప్పటికీ.. అది దక్కలేదు. అప్పట్నుంచి ఆయన పార్టీపై గుర్రుగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో తన అనుచరులకు ఫోన్లు చేస్తూ.. బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని చెప్పుకుంటున్నారు. ఇక.. సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి మళ్లీ పోటీ చేసే అవకాశం ఇస్తే.. తన మద్దతు ఉండదని చెబుతున్నారు. తన వారసుడి రాజకీయ భవిష్యత్ కోసం.. ఏదో ఒక పార్టీలో చేరాలనే ఆలోచనతో గుర్నాథ్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. రేవంత్ రెడ్డి కూడా కొడంగల్‌పై ఫోకస్ పెంచారు. ఈసారి.. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. ఇక.. బీజేపీకి కొడంగల్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది. ఈసారి.. కొడంగల్‌లో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నదే.. ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు