Narayankhed Constituency: నారాయణఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ.. హస్తం పార్టీలో గ్రూపు రాజకీయాలు..

గత రెండుసార్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ను ఈసారి ఓడించి.. తన పాత కోటలో మళ్లీ పాగా వేయాలని చూస్తోంది కాంగ్రెస్.. ఒకప్పుడు నారాయణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్ పటిష్టంగా ఉండేది.

Narayankhed Constituency: నారాయణఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ.. హస్తం పార్టీలో గ్రూపు రాజకీయాలు..

Narayankhed Assembly Constituency Ground Report

Narayankhed Assembly Constituency : నారాయణఖేడ్ నియోజకవర్గంలో అప్పుడే పొలిటికల్ హీట్ మొదలైంది. అధికార బీఆర్ఎస్‌తోపాటు, బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి (Mahareddy Bhupal Reddy) మాత్రం తిరిగి తానే గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. మరి ఈసారి భూపాల్ రెడ్డిని ఢీకొట్టగల లీడరు ఎవరు? ఏ పార్టీ తరుపున ఎవరు పోటీలో నిలవనున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ సారి కన్పించబోయే సీనేంటి?

నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. మూడు సార్లు స్వతంత్రులు విజయం సాధించగా, ఒక సారి టీడీపీ గెలిచింది. 2016లో జరిగిన ఉప ఎన్నికల నుంచి బీఆర్ఎస్ విజయ పరంపర కొనసాగుతోంది. 1957లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థి అప్పారావు షెట్కార్ విజయం సాధించారు. 1989 నుంచి కిష్టారెడ్డి వరుస విజయాలతో దూసుకెళ్లారు. 2016 లో కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి విజయం సాధించి.. నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. వరుస విజయాలతో ఓటమి లేని నేతగా పట్టు సాధించారు భూపాల్‌రెడ్డి.

నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీతోపాటు మనూర్, నాగల్ గిద్ద, కల్హేర్, సిర్గాపూర్, కంగ్టి కొత్తగా ఏర్పడిన నిజాంపేట మండలాలు ఉన్నాయి. మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. మొత్తం 2 లక్షల 5 వేల 669 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,04,272మంది , మహిళలు 1,01,390 మంది ఉన్నారు. నియోజకవర్గంలో 1957 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2016 నుంచి బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా నిలిచింది.

Mahareddy Bhupal Reddy

Mahareddy Bhupal Reddy

వరుసగా గెలుస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి గతంలో అసమ్మతి తలనొప్పి పెద్దగా లేదనే చెప్పాలి. కానీ, ఇటీవల ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది. శంకరంపేటకు చెందిన బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఈ సారి టిక్కెట్ ఇవ్వాలంటూ ఎమ్మెల్యేకు పోటీగా తయారయ్యారు. రాజకీయంగా తన కుటుంబానికి నియోజకవర్గంలో పట్టుఉందని.. అధిష్టానం అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానంటూ శ్రీనివాస్ గౌడ్ తిరుగుతున్నారు.

Also Read: తనయుడి కోసం పోటీ నుంచి తప్పుకోనున్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. జూనియర్ జువ్వాడి సైతం..

Dr Sanjeev Reddy NKD

Dr Sanjeev Reddy NKD

గత రెండుసార్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ను ఈసారి ఓడించి.. తన పాత కోటలో మళ్లీ పాగా వేయాలని చూస్తోంది కాంగ్రెస్.. ఒకప్పుడు నారాయణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్ పటిష్టంగా ఉండేది. 2014లోనూ కాంగ్రెస్ గెలిచినా.. ఆయన ఆకస్మిక మరణంతో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పాగా వేసింది. అయితే కాంగ్రెస్ పుంజుకున్నట్లు కనిపిస్తున్నా.. గ్రూపు రాజకీయాలు హస్తం పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే కుమారుడు డాక్టర్ సంజీవరెడ్డి (Dr Sanjeev Reddy), మాజీ ఎమ్మెల్యే సురేష్ షెట్కార్ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండటంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత్ జోడో యాత్రలో అగ్రనేత రాహుల్ గాంధీ నియోజకవర్గంలో అడుగు పెడితే రెండు వర్గాలు విడి విడిగా స్వాగతం పలకడం అప్పట్లో చర్చనీయాంశమైంది. రెండు వర్గాల మధ్య రాజీ చేసే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. వర్గపోరుతో క్యాడర్ అయోమయం ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సారి కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు డాక్టర్ సంజీవరెడ్డి.

Sangappa, BJP

Sangappa

ఇక బీజేపీ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తర్వాతే బీజేపీ స్థానమనే విశ్లేషణలు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ప్రధాన పోటీ జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నా.. బీజేపీ బలపడిందని.. కమలం వికసించడం ఖాయమని అంటున్నారు కాషాయ నేతలు. మాజీ జర్నలిస్ట్ సంగప్ప (Sangappa), సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు విజయపాల్ రెడ్డి బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో లింగాయత్ సామాజికవర్గం ఎక్కువగా ఉండటం, ఇరవై ఏండ్లుగా జర్నలిస్ట్ గా ప్రజా సమస్యలపై అవగాహన ఉండటం తనకు కలిసొచ్చే అంశమని సంగప్ప అంటున్నారు.

Also Read: హాట్ హాట్‌గా జుక్కల్ పాలిటిక్స్.. ట్రయాంగిల్ ఫైట్ లో నిలిచేదెవరు.. పైచేయి ఎవరిది?

మొత్తంగా చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుండగా, పార్టీలోనే మరో నాయకుడు శ్రీనివాస్ గౌడ్ సీటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా అటు బిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మధ్యనే ఈసారి హోరాహోరీ పోటీ ఉండే అవకాశం కన్పిస్తోంది.