Jukkal Constituency: హాట్ హాట్‌గా జుక్కల్ పాలిటిక్స్.. ట్రయాంగిల్ ఫైట్ లో నిలిచేదెవరు.. పైచేయి ఎవరిది?

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష పార్టీలు వెనుకబడ్డాయనే టాక్ జుక్కల్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత జుక్కల్ కాంగ్రెస్ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చింది.

Jukkal Constituency: హాట్ హాట్‌గా జుక్కల్ పాలిటిక్స్.. ట్రయాంగిల్ ఫైట్ లో నిలిచేదెవరు.. పైచేయి ఎవరిది?

Jukkal Assembly Constituency Ground Report

Updated On : July 26, 2023 / 5:36 PM IST

Jukkal Assembly Constituency: ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ.. జుక్కల్ పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే.. వరుసగా నాలుగోసారి తన లక్.. చెక్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. కానీ.. ఈసారి ఆయన గెలిచేందుకు ఏ మేరకు అవకాశాలున్నాయన్నదే.. లోకల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తిగా.. అభివృద్ధి, సంక్షేమాన్ని నమ్ముకొని బరిలో దిగితే.. మూడోసారి గులాబీ జెండా ఎగురుతుందా? కారు పార్టీని ఎదుర్కొనేందుకు.. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలేంటి? ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో దిగబోతున్నారు? జుక్కల్‌‌లో పొలిటికల్ లెక్కలు ఏ విధంగా ఉన్నాయ్?

తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉండే నియోజకవర్గం.. జుక్కల్. 1957లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్‌కు కంచుకోట. తర్వాత.. తెలుగుదేశం ఇక్కడ జెండా పాతింది. ఇప్పుడు.. జుక్కల్ బీఆర్ఎస్‌కు అడ్డాగా మారింది. మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజలు మరాఠీ మాట్లాడతారు. అక్కడక్కడ మహారాష్ట్ర, కర్ణాటక సంస్కృతి కూడా కనిపిస్తుంటుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ ఇది. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే (Hanmanth Shinde). ఒకప్పుడు.. జుక్కల్‌లో ద్విముఖ పోటీ ఉండేది. కానీ.. ఈసారి అది ట్రయాంగిల్ ఫైట్‌గా ఉండబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక.. జుక్కల్ నియోజకవర్గంలో 7 మండలాలున్నాయి. అవి.. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, పెద్దకొడప్గల్, డోంగ్లి. ఈ నియోజకవర్గం పరిధిలో.. మొత్తం లక్షా 89 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో.. దళితులతో పాటు మున్నూరు కాపు, లింగాయత్ సామాజిక వర్గాలే.. డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌గా ఉన్నాయి.

Hanmanth Shinde

Hanmanth Shinde

అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకే.. మళ్లీ టికెట్ కన్ఫామ్ అనే ప్రచారం నడుస్తోంది. అంతేకాదు.. ఇటీవల కేటీఆర్ జుక్కల్ వెళ్లినప్పుడు కూడా టికెట్ షిండేకే ఇస్తున్నాం.. భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. అంతా బాగానే ఉన్నా.. ఎమ్మెల్యే షిండేపై ఉన్న వ్యతిరేకత, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జరిగిన వివక్ష లాంటివి.. ఆయనకు నెగటివ్‌గా పనిచేసే అవకాశాలున్నాయంటున్నారు. ఎమ్మెల్యే హన్మంత్‌కు వివాదరహితుడనే పేరున్నా.. అంతకుమించి మరొకటేమీ లేదనే టాక్ కూడా ఉంది. దళిత బంధు పథకం.. నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి మాత్రమే పరిమితం చేశారు. దాంతో.. మిగతా మండలాల్లోని దళితులు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. ఇదే.. పెద్ద మైనస్ కాబోతోందనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో మద్నూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు, పత్తి రైతులకు టెక్స్‌టైల్ పరిశ్రమల ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ హామీ కాగితాలకే పరిమితమైంది.

ఇక.. నిజాం సాగర్‌ని టూరిజం పరంగా డెవలప్ చేస్తామన్నా.. అదింకా నెరవేరనే లేదు. మద్నూర్ మండల రైతులకు సాగునీరు అందిస్తామన్న హామీ కూడా పట్టాలెక్కలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలోనూ.. జుక్కల్ వెనుకబడింది. ఇవన్నీ.. ఎమ్మెల్యే షిండేకు ప్రతికూలంగా మారే చాన్స్ ఉందంటున్నారు. అయితే గులాబీ పార్టీకి సర్కార్ సంక్షేమ పథకాలే పాజిటివ్‌గా మారతాయనే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. నెరవేరని హామీలు, ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు లాంటివి ఎఫెక్ట్ చూపుతాయంటున్నారు. అయినప్పటికీ.. కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని.. ఎమ్మెల్యే హన్మంత్ షిండే నమ్మకంగా ఉన్నారు.

Gangaram Soudagar

Gangaram Soudagar

ఇక.. కాంగ్రెస్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సౌదాగర్ గంగారాం (Gangaram Soudagar) మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 3 సార్లు ఓటమిపాలవడంతో ఆయనకు సానుభూతి కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ రేసులో నిజామాబాద్‌కు చెందిన గడుగు గంగాధర్ (Gadugu Gangadhar) కూడా ఉన్నారు. ఆయన గతంలో డీసీసీ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీ ఆశీస్సులతో జుక్కల్ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక.. NRI, విద్యావేత్త తోట లక్ష్మీకాంతరావు (Laxmi Kantha Rao Thota) కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే.. ఆయన వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాంకు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆశీస్సులున్నాయనే ప్రచారం గట్టిగా నడుస్తోంది. ఇంతమంది ఆశావహుల్లో టికెట్ ఎవరికి దక్కుతుందనేదే ఆసక్తిగా మారింది.

Also Read: ఎల్లారెడ్డిలో హ్యాండిచ్చిన ఎమ్మెల్యేపై రగిలిపోతోన్న కాంగ్రెస్.. సత్తాచాటాలని చూస్తున్న బీజేపీ

బీఆర్ఎస్ హయాంలో.. జుక్కల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు కాంగ్రెస్ నేత సౌదాగర్ గంగారాం. సామాన్య ప్రజలకు కూడా ఎమ్మెల్యే అందుబాటులో ఉండరని.. ప్రతి మండలానికి తన అనుచరులను పెట్టి.. అధికారం చెలాయిస్తున్నారని.. చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో.. కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయని నమ్మకంగా చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే గంగారాం.

Aruna Tara

Aruna Tara

ఇక.. బీజేపీ విషయానికొస్తే.. అరుణతార జుక్కల్‌లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం.. ఆవిడన కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 1999లో.. ఆమె తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు. మళ్లీ.. 2009లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో.. ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో.. కొన్నాళ్ల పాటు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే.. ఆవిడ ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండరనే పేరుంది. ఇదే.. మైనస్‌గా మారే అవకాశం ఉందంటున్నారు. ఇక.. బీఆర్ఎస్ పాలనలో జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడిందని.. ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని.. అరుణతార అంటున్నారు.

Also Read: సిరిసిల్లలో కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు వేస్తున్న ఎత్తులేంటి.. బీజేపీ నుంచి పోటీచేసేదెవరు?

ఇన్నాళ్లూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష పార్టీలు వెనుకబడ్డాయనే టాక్ జుక్కల్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత జుక్కల్ కాంగ్రెస్ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చింది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. బీజేపీ కూడా యాక్టివ్‌గా పనిచేస్తోంది. గత ఎన్నికల్లో 35 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గెలిచారు. కాంగ్రెస్ నుంచి గంగారాం ప్రత్యర్థిగా ఉన్నంతకాలం హన్మంత్ షిండే గెలుపుకు ఢోకా లేదనే టాక్ కూడా నడుస్తోంది. మరి.. ఈసారి నెలకొన్న త్రిముఖ పోటీలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందన్నది ఆసక్తిగా మారింది.