Komatireddy Venkat Reddy (Image Credit To Original Source)
Komatireddy Venkat Reddy: మహిళా అధికారుల మీద ఇటీవల మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాలను తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కలెక్టర్ల బదిలీలను మంత్రి చూసుకోరని, ముఖ్యమంత్రి చూసుకుంటారని తెలిపారు.
ఐఏఎస్ ఉద్యోగం రావడం అంత ఆషామాషీ కాదని, వారిపై అభాండాలు వేయడం కరెక్ట్ కాదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. “అన్ని మీడియా యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పుడు వార్తలు వేయడం సరైంది కాదు. మహిళా అధికారులను మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు.
రాజకీయ నాయకుల మీద సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సీఎంవోలో ఒక మహిళ ఇష్యూ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇన్‌చార్జ్ మంత్రి మీద కూడా వార్తలు వేస్తున్నారు. ఇప్పుడు నల్గొండ మంత్రి అని తప్పుడు వార్తలు వేస్తున్నారు. డీజీపీతో ఇలాంటి అంశాలపై చర్చించాము. సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని డీజీపీని కోరాం.
Also Read: ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలపై రేవంత్ కన్ను.. అది జరగనివ్వం: కేటీఆర్
తప్పుడు వార్తలపై నివేదిక ఇవ్వాలని డీజీపీ, ఇంటెలిజెంట్ అధికారులను కోరాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత లీగల్ యాక్షన్ తీసుకుంటాం. కలెక్టర్ పోస్టింగ్‌లో మంత్రుల, రాజకీయ నాయకుల జోక్యం ఉండదు. వాస్తవాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను.
ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయడం మానేయాలి. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని వదులుకున్నాను. నా కొడుకును పోగొట్టుకున్నాను. కొడుకు పేరుతో ప్రజలకు సేవ చేస్తున్నాను. పేద ప్రజలకు సేవ చేస్తున్న నాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చెయ్యడం కరెక్ట్ కాదు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాను.
ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రికార్డు స్థాయిలో ఎంపీగా విజయం సాధించాను. నన్ను మానసికంగా ఇబ్బందికి గురి చేయడం కరెక్ట్ కాదు. తప్పుడు వార్తలు వేసి ఏం సాధిస్తారు? నాకు దైవ భక్తి ఎక్కువ.. నేను దేవుడిని నమ్ముతాను. అంతా దేవుడే చూసుకుంటాడు. డీజీపీతో మాట్లాడాం.. సమగ్ర విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.