Komatireddy Venkat Reddy Is A Key Decision
Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి పొలిటికల్ గా ఎలాంటి కామెంట్స్ చేయనని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని వెల్లడించడం గమనార్హం. ప్రజల సమస్యలపై మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. రాష్ట్రంలో ఎవరైనా తన ఇంటి తలుపు తట్టవచ్చన్నారు.
టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో కలకలం రేపింది. టీపీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న అనంతరం హాట్ కామెంట్స్ చేయడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపింది.
గాంధీ భవన్ కు రానని, ఓటుకు నోటు విధానం ద్వారా టీపీసీసీ ఎంపిక ప్రక్రియ జరిగిందని హాట్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ, టీటీడీపీ గా మారిపోయిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ లో ఉన్న నేతలు స్పందించలేదు. కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయ్యింది. ఆయన చేసిన వ్యాఖ్యలను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా 24 గంటలు గడవకముందే..కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు మాట్లాడనని, కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడంతో ఆయనపై చర్యలు తీసుకోరనే ప్రచారం జరుగుతోంది.