Komatireddy Venkat Reddy : రేవంత్‌‌పై ఘాటు వ్యాఖ్యలు, పాదయాత్ర చేస్తా

Komatireddy Venkat Reddy : టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం కాంగ్రెస్ లో కాకా పుట్టిస్తోంది. దీనిని జీర్ణించుకోలేని కొంతమంది నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఏకంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఓటుకు నోటు కేసులో మాదిరిగానే..పీసీసీ చీఫ్ ఎంపిక జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారాయన.

ఢిల్లీకి వెళ్లాక తనకు ఈ విషయం తెలిసిందన్నారు. 2021, జూన్ 27వ తేదీ ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త అధ్యక్షుడుతో సహా..కార్యకర్తలెవరూ తనను కలవడానికి రావొద్దన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కొత్త నాయకత్వంలో హుజూరాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోవాలంటూ కోమటిరెడ్డి సెటైర్ వేశారు.

కాంగ్రెస్ కూడా టీటీడీపీ మాదిరిగానే మారబోతోందని కామెంట్ చేశారు. టీ-పీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదని, తనకు ఒకింత బాధగా ఉందని, కార్యకర్తలే తన ప్రాణంగా బతికినవాడినని కోమటిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులను హై కమాండ్ ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు