Konda Surekha : పదవి ఉంది.. పవర్ లేదు! హైకమాండ్‌కు కొండా సురేఖ సంచలన లేఖ
Konda Surekha : మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. అధికారాల తగ్గింపు, సీఎంవో జోక్యం, వరంగల్ తూర్పుపై వివక్ష, రాజకీయ అణచివేతపై ఆమె లేఖలో కీలక ఆరోపణలు చేశారు.
- Sreehari A
- Published on- September 3, 2026 / 04:33 PM IST
Konda Surekha
- న్యాయం కోసమే హైకమాండ్‌ను ఆశ్రయించానని కొండా సురేఖ వెల్లడి
- సీఎంవో నుంచే నేరుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు
- బీసీ మహిళా నాయకురాలిననే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన
Konda Surekha : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. కొండా సురేఖపై వేటు పడింది. ఆమెను మంత్రివర్గం నుంచి రేవంత్ సర్కార్ బర్తరఫ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హైకమాండ్‌ను ఆశ్రయిస్తూ తనకు ఎదురవుతున్న రాజకీయ, పరిపాలనా సమస్యలను వివరిస్తూ లేఖలో ఫిర్యాదు చేశారు. మంత్రి పదవి ఉన్నప్పటికీ తన అధికారాలను తగ్గిస్తున్నారని, కీలక నిర్ణయాలు సీఎంవో నుంచే నేరుగా తీసుకుంటున్నారని ఆమె లేఖలో ఆరోపించారు.
తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాల్లో కూడా తనను భాగస్వామ్యం చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సమయంలో కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్నారు.
అందులో నా ఫొటోను తొలగించారు :
సమ్మక్క–సారలమ్మ ఆలయ నిధులను ఆర్‌అండ్‌బీకి బదిలీ చేసిన వ్యవహారంలోనూ తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ప్రభుత్వ ప్రకటనల్లో తన ఫొటోను తొలగించారనే విషయాన్ని కూడా ఆమె లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
Read Also : Konda Surekha : కొండా సురేఖ బర్తరఫ్.. హైకమాండ్ సంచలన నిర్ణయం
మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో కూడా తనను అవమానించారని వాపోయారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంపై వివక్ష చూపడమే కాకుండా కడియం శ్రీహరి తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అంశాన్ని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు.
రాజకీయంగా ఒంటరి చేయాలనే.. :
అదేవిధంగా, వరంగల్‌లో కొండా కుటుంబాన్ని రాజకీయంగా ఒంటరి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. కొందరు నేతలకు రాజకీయంగా ప్రోత్సాహం అందిస్తున్నారని విమర్శించారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు ఇవ్వడాన్ని కూడా సురేఖ లేఖలో తప్పుబట్టారు.
న్యాయం కోసమే హైకమాండ్ వద్దకు :
తాను బీసీ మహిళా నాయకురాలిననే కారణంతో రాజకీయంగా, పరిపాలనా పరంగా అణచివేతకు గురవుతున్నానని సురేఖ హైకమాండ్‌కు లేఖలో వివరించారు. తన ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరిపి, మంత్రి హోదా, గౌరవాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వంపై తనకు విశ్వాసం ఉందని, న్యాయం కోసమే హైకమాండ్‌ను ఆశ్రయించినట్టు సురేఖ లేఖలో స్పష్టం చేశారు.
