Telangana Rains : తెలంగాణలో వర్షాల బీభత్సం.. 17జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ తేదీల్లో అత్యంత భారీ వర్షాలు.. బయటకు రావొద్దు..
Telangana Rains : బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Weather Updates Heavy Rains in Telangana 17 Districts Red Alert
Telangana Rains : బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బుధ, గురువారాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతోపాటు.. కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కూడా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 25, 26 (శుక్ర, శని) తేదీల్లోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బుధవారం పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్ధిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. అదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు అరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
గురువారం పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలాఉంటే.. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
