Konda Surekha : కొండా సురేఖ బర్తరఫ్.. హైకమాండ్ సంచలన నిర్ణయం
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. కొండా సురేఖపై వేటుపడింది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించారు. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల విజయలక్ష్మి నియామకం, మహిళా కమిషన్‌కు నేరెళ్ల శారద బాధ్యతలు చేపట్టనున్నారు.
Konda Surekha Sacked
- తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. కొండా సురేఖపై వేటు
- చిన్నారెడ్డికి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు
- చిన్నారెడ్డి స్థానంలో గద్వాల విజయలక్ష్మి నియామకం
- మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద
- చైర్ పర్సన్ గా గుండు సుధారాణి నియామకం
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. గత కొన్నిరోజులుగా కొండ సురేఖ వ్యవహారం ఉత్కంఠ రేపుతున్న వేళ.. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
దాంతో కొండా సురేఖ రాజీనామా చేస్తారా? లేక బర్తరఫ్ అవుతారా? అనే చర్చకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆమోదం లభించిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సిఫారసు చేస్తూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు లేఖ పంపినట్టు సీఎంఓ ప్రకటించింది. కొండా సురేఖ రాజీనామాకు అంగీకరించకపోవడంతోనే బర్తరఫ్ సిఫారసు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చిన్నారెడ్డికి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు
ఇదే సమయంలో ప్రభుత్వం కీలక పదవుల్లో కొత్త నియామకాలను కూడా చేపట్టింది. తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు.. తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమించింది. అలాగే, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొండా సురేఖ బర్తరఫ్ ముందు పార్టీ నేతలు ఢిల్లీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. కొండా సురేఖ వైఖరిపై పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉందని, పార్టీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి తెలిపినట్టు తెలుస్తోంది.
