చార్మినార్ ప్రాంతంలో అగ్నిప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, బండి సంజయ్ రియాక్షన్ ఇదే.. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు

పాతబస్తీ ప్రమాదం ఘటనలో 17మంది మృతి చెండగా.. వారిలో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారు.

Major Fire Broke at Gulzar House

Major Fire Broke at Gulzar House: పాతబస్తీలోని మీర్ చౌక్ ప్రాంతంలో పెను విషాదం చోటు చేసుకుంది. గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 6.30 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడటంతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం వరకు ఈ దుర్ఘటనలో 17మంది మృతిచెందారు.

 

ప్రమాద ఘటనపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. పాతబస్తీ ప్రమాదం ఘటనలో 17మంది మృతి చెందినట్లు చెప్పారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఒకటిన్నర ఏండ్లు ఒకరు, ఏడేళ్లు ఒకరు, నాలుగేళ్లలోపు పిల్లలు ఆరుగురు ఉన్నట్లు తెలిపారు. మృతుల్లో నలుగురు అరవై ఏళ్ల నుంచి డెబ్బై ఐదేళ్లు వయస్సు వారు ఉండగా.. ఐదుగురు ముప్పై నుంచి నలబై ఏళ్లలోపు వయస్సు వారు ఉన్నారు. 17 మృతదేహాలను మార్చురీకి తరలించినట్లు నాగిరెడ్డి చెప్పారు.

 

కేసీఆర్ దిగ్భ్రాంతి..
పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడడం పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని, మరణించిన వారి కుటుంబాలకు తగు ఆర్థికసాయం చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిత్యం అప్రమత్తంగా ఉంటూ తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

కేటీఆర్ స్పందన..
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానని కేటీఆర్ అన్నారు. ఈ విషాద ఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అగ్నిప్రమాదం త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తూ, ప్రార్థిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రమాద స్థలం వద్ద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదానికి కారణాలను లోతుగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం ప్రకటించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషాద సమయంలో హైదరాబాద్ ప్రజలంతా ఐక్యంగా నిలిచి, బాధితులకు అండగా ఉండాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

 

ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారు : హరీశ్ రావు
అగ్నిప్రమాదం ఘటన అత్యంత బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమైందని, వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అనుసరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నారు. ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారు. ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

బండి సంజయ్ దిగ్భ్రాంతి..
హైదరాబాద్ పాతబస్తీ గుల్జారా హౌస్ అగ్ని ప్రమాద సంఘటనపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలకు అన్నివిధాల కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు.