KTR Interesting Comments on KCRKTR Interesting Comments on KCR
KTR Comments : తాత్కాలికంగా మన చంద్రుడు మబ్బుల్లోకి వెళ్ళాడని, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని, కేసీఆర్ సీఎం అవుతారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవాలని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లోనే మన సత్తా చూపుకోవాలి అంటూ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పిలుపునిచ్చారు.
Read Also : Delhi Election Results : ఢిల్లీ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. పార్టీ ఆఫీసులో మొదలైన సంబరాలు..!
కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, రేవంత్ దుర్మార్గ పాలన రాష్ట్రంలో సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 400 మంది పోలీసులను పంపి కొడంగల్‌లో భూసేకరణకు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారని కేటీఆర్ దుయ్యబట్టారు. పేదల సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏం చేస్తారో రాష్ట్ర ప్రజలకు అర్థం అయిందన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సేవలను పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకుంటుందని కేటీఆర్ చెప్పారు. ఆయన మన ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారని స్పష్టం చేశారు. 2009లో రాష్ట్రంలో 10 ఎమ్మెల్యే స్థానాలు గెలిస్తే అందులో సిర్పూర్ ఒకటని, అన్ని రాజకీయ పార్టీల్లో పోరాటవాదులు, అవకాశవాదులు ఉంటారని గుర్తు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్‌ను చట్టసభల్లోకి పంపించేందుకు ప్రయత్నించామని, రాష్ట్రంలో కాంగ్రెస్ 8, బీజేపీ 8 స్థానాలు గెలిచినా ప్రయోజనం శూన్యమన్నారు.
పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వమని కేంద్రం తెల్చి చెప్పిందన్నారు. కేంద్ర బడ్జెట్లో రూపాయి తెలంగాణకు కేటాయించలేదని చెప్పారు. ఇది తెలిసినా రెండు జాతీయ పార్టీల ఎంపీలు నోరు మెదపడం లేదని కేటీఆర్ విమర్శించారు. లోకసభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉంటే.. పార్లమెంట్లో పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సిర్పూర్‌ను మహారాష్ట్రలో కలపమని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారని, ఆయన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత పెంచుకుందని చెప్పారు. మనం అంతా కలిసి కొట్లాడితే కాంగ్రెస్, బీజేపీలో కనిపించవని కేటీఆర్ పేర్కొన్నారు.