Delhi Election Results : ఢిల్లీ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. పార్టీ ఆఫీసులో మొదలైన సంబరాలు..!

Delhi Election Results : దేశ రాజధానిలోని ఢిల్లీ బీజేపీ కార్యాలయం వెలుపల ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ పార్టీ శ్రేణుల వేడుకలకు సంబంధించి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Delhi Election Results : ఢిల్లీ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. పార్టీ ఆఫీసులో మొదలైన సంబరాలు..!

Celebrations begin at BJP office ( Image Source : PTI )

Updated On : February 8, 2025 / 2:52 PM IST

Delhi Election Results 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే అందరి చూపు.. ఢిల్లీ పీఠం ఎవరిది అనేది ఉత్కంఠగా మారింది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఆప్ ఉవ్విళ్లురుతుండగా.. సరిగ్గా 27 ఏళ్ల విరామం తర్వాత బీజేపీ దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి ఎలాగైనా రావాలని చూస్తోంది.

ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. ప్రారంభ ట్రెండ్స్ పరిశీలిస్తే.. బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే.. మొత్తం సీట్లలో సగం మార్కును దాటింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 29 స్థానాల్లో ముందంజలో ఉంది. మూడు రౌండ్ల కౌంటింగ్ తర్వాత ఢిల్లీ స్థానం నుంచి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 343 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమే అన్నట్టుగా ఆ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వెలుపల పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు డ్యాన్సులు చేస్తూ ఒకరినొకరు అభినందించుకుంటున్నట్లు దృశ్యాలు కనిపించాయి.

“ఢిల్లీ ప్రజలు బీజేపీకి నిర్ణయాత్మక ఫలితాన్ని ఇస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఢిల్లీ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందుతుంది. దేశ రాజధాని నుంచి ఆప్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని నేను నమ్మకంగా చెప్పగలను” అని బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి ధీమా వ్యక్తం చేశారు. ఈయన ఆప్ నేత, ఢిల్లీ సీఎం అతిషిపై పోటీగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ పీఠం కాషాయ పార్టీదే : వీరేంద్ర సచ్ దేవా :
ప్రారంభ ట్రెండ్‌లు బీజేపీకి గణనీయమైన ఆధిక్యాన్ని సూచిస్తున్నాయి. ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. ఈసారి ఢిల్లీలో జెండా ఎగిరేది కాషాయ పార్టీ నుంచేనని అన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు మా అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. కానీ, తుది ఫలితం కోసం మేం వేచి ఉంటాము” అని కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత సచ్‌దేవా విలేకరులతో అన్నారు.

ఢిల్లీలో బీజేపీ “డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని” ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఈ విజయం ప్రధాని మోదీ దార్శనికత ఫలితమని చెప్పేందుకు తమకు ఎలాంటి సందేహం లేదన్నారు. ఢిల్లీకి బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా మేం అందిస్తామని చెప్పారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో పాడుపడిన రోడ్లు, మద్యం విధాన వివాదాలు, మురికి నీరు, అవినీతి వంటి అంశాలపై బీజేపీ ఎన్నికల్లో పోరాడిందని అన్నారు.

1998 నుంచి ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేదు. మరోవైపు, గత 10 ఏళ్లుగా ఆప్ ఢిల్లీ రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయించింది. 2015, 2020 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచింది. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. ఇప్పుడైనా తిరిగి అధికారంలోకి రావాలని హస్త పార్టీ చూస్తోంది. ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో 1.55 కోట్ల మంది అర్హులైన ఓటర్లతో ఢిల్లీలో 60.54 శాతం పోలింగ్ నమోదైంది.