HCU Lands: పెద్ద భూ కుంభకోణం.. ఒక బీజేపీ ఎంపీ కూడా.. 3 రోజుల్లో బయటపెడతా: కేటీఆర్

అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వస్తుందని చెప్పారు.

KTR

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యవహారంలో పెద్ద భూ కుంభకోణం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఒక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని తెలిపారు. 2, 3 రోజుల్లో కుంభకోణం బయట పెడతానని అన్నారు.

ఇవాళ కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ పెంచడం, గ్యాస్‌ ధరల పెంపుపై కేటీఆర్ మండిపడ్డారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వస్తుందని చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నప్పటికీ భారత ప్రభుత్వం మాత్రమే గ్యాస్ పెట్రోల్ ధరలను పెంచుతోందని అన్నారు. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఇక్కడ కూడా ధరలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయని తెలిపారు. సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతుందని అన్నారు.

Also Read: నిన్న రొయ్యలపై నష్టం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు దెబ్బ? ఏంటి ట్రంప్ ఇలా చేశారు?

ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానం పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదని కేటీఆర్ తెలిపారు. అమెరికా సుంకాల వల్ల తెలంగాణకు పెద్ద దెబ్బ తగలబోతుందని అన్నారు. తెలంగాణ నుంచి అధికంగా ఎగుమతులు అయ్యే ఫార్మా, ఐటీపై అమెరికా విధించిన పన్నులు తెలంగాణకు తీవ్రంగా నష్టం చేకూర్చబోతున్నాయని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఈ రెండు రంగాలకు దెబ్బ తగిలితే తెలంగాణ ఆర్థిక ప్రగతి దెబ్బతింటుందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణను జాతీయ పార్టీలకు అప్పజెప్పితే ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ ఉంటుందని ముందే చెప్పామని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ విస్తరణ చేసుకునే పరిస్థితిలో లేదని చెప్పారు.

బీఆర్ఎస్‌ సిల్వర్ జూబ్లీ సంబరాల నిర్వహణపై కేటీఆర్ స్పందిస్తూ.. వరంగల్ ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా… ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాని ప్రాంతంలో సభ ఉంటుందన్నారు. 1200 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. సభ ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు.

తెలుగునాట విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు తెలుగుదేశం, బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ చెప్పారు. అందుకే ఏడాదిపాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ ద్వారా 3000 బస్సుల కోసం విజ్ఞప్తి చేశానని, ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్పారు. 27వ తేదీ ఆదివారం కావడం, విద్యార్థులకు సెలవులు ఉండటం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగవని అన్నారు. 33 జిల్లాల నాయకుల ప్రతినిధులతో కేసీఆర్ స్వయంగా నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారని తెలిపారు.

తమ పార్టీ చరిత్రలో ఇది ఒక పెద్ద మీటింగ్ అవుతుందని కేటీఆర్ చెప్పారు. బహిరంగ సభ తర్వాత విద్యార్థి , కార్యకర్తల సభ్యత్వ నమోదు ఉంటుందని అన్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తల శిక్షణ సమావేశాలు ఉంటాయని తెలిపారు.

ప్రభుత్వం గతంలో తమ పార్టీ సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని కేటీఆర్ అన్నారు. ఈ బహిరంగ సభకు కూడా అనుమతులు ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతామని చెప్పారు. అనుమతి ఇవ్వకపోవడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి కారణమూ లేదని అన్నారు.