Ktr Legal Notice : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్.. ఆ ముగ్గురికి లీగల్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు.

Ktr Legal Notice

Ktr Legal Notice : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ కన్నెర్రజేశారు. ఒక మంత్రి, ఎమ్మెల్యే సహా ముగ్గురికి లీగల్ నోటీసులు పంపారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు.

పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ చానళ్లకూ లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. తనపై అసత్య ఆరోపణలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని కూడా వదిలేది లేదన్నారు కేటీఆర్. ప్రజల్లో తన పాపులారిటీని దెబ్బతీసేందుకే ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల్లో తనపై ఓటమిని జీర్ణించుకోలేక కేకే మహేందర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తక్షణమే ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటానికి సిద్ధం కావాలని హెచ్చరించారు.

కేటీఆర్ లీగల్ నోటీసులపై కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ”నేను ఫిర్యాదు చేస్తే కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు. కేటీఆర్ లీగల్ నోటీసులు పరిశీలించాక చట్ట ప్రకారం తగిన సమాధానం ఇస్తాను. ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ చట్టపరంగా నాకు పలానా వారిపై అనుమానాలు ఉన్నాయి, పలానాది జరిగి ఉండొచ్చని ఫిర్యాదు ఇచ్చే అధికారం ప్రతి సిటిజన్ కు ఉంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును కూడా వినియోగించుకోవద్దు, నా పేరు మీద ఫిర్యాదే రావొద్దు అనడం చూస్తే కేటీఆర్ విపరీతమైన ధోరణికి అద్దం పడుతుంది. నేను తప్పు చేసినట్లు అయితే చట్టపరంగా ఆయనకు నాపై చర్యలు తీసుకునే అధికారం ఉంది” అని కేకే మహేందర్ రెడ్డి అన్నారు.

Also Read : హీరోయిన్లను బెదిరించారన్న ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. తాట తీస్తామంటూ హెచ్చరిక

 

ట్రెండింగ్ వార్తలు