KTR Meets Harish Rao
KTR- Harish Rao: బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుతో మరోసారి భేటీ అయ్యారు. శుక్రవారం కేటీఆర్ కోకాపేటలోని హరీశ్ రావు నివాసంకు వెళ్లిన విషయం తెలిసిందే. వారిద్దరూ దాదాపు రెండు గంటలు పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అయితే, శనివారం కూడా కేటీఆర్ హరీశ్ రావు నివాసానికి వెళ్లి భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.
గత కొద్దిరోజులుగా హరీశ్ రావు పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారంపై సైబర్ సెల్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదుసైతం చేసిన విషయం తెలిసిందే. అయితే, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆ అంశంపైనా హరీశ్ రావు ఇటీవల స్పందించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని, కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించినప్పటికీ పని చేస్తానని హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. అయితే, వరంగల్ లో సభ తరువాత పార్టీలో హరీశ్ రావు ప్రాముఖ్యత తగ్గిందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుండటంతో.. ఆ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలనే హరీశ్ రావు ఇంటికివెళ్లి కేటీఆర్ బేటీ అయినట్లు చర్చ జరుగుతుంది. మరోవైపు హరీశ్ రావు తండ్రి అనారోగ్యం బాగోలేకపోవటంతో కేటీఆర్ పరామర్శకు వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు సమాచారం. శుక్రవారం కేటీఆర్, హరీశ్ రావుల భేటీలోనూ ఈ అంశాలపై చర్చ జరిగినట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదే క్రమంలో శనివారం కూడా హరీశ్ రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్ అక్కడ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు. ఉద్యోగ సమస్యలు, వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, స్వామిగౌడ్, మాజీ ఉద్యోగుల సంఘం నేతలు దేవి ప్రసాద్, పాతూరి సుధాకర్ రెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు.