త్వరలో ఫ్రీ బస్సు హామీ మాయమవ్వడం ఖాయం: కేటీఆర్

రానున్న రోజుల్లో పార్లమెంట్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలనూ బీఆర్ఎస్ గెలుచుకుంటుందని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ 420 హామీలతో అధికారంలోకి వచ్చిందని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలో ఫ్రీ బస్సు హామీ కూడా మాయమవ్వడం ఖాయమని చెప్పారు. ఆదిలాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పిన విషయం ఏమైందని నిలదీశారు.

కుర్చీ ఎవరైనా ఎత్తుకెళ్తారనే భయంతోనే గడువుకి రెండు రోజుల ముందే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని కేటీఆర్ తెలిపారు. రైతుబంధు అడిగితే చెప్పు తీసుకుని కొడతానని మంత్రి కోమట్‌రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారని చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు కరెంట్ లేదు, మంచినీళ్లు లేవని వ్యాఖ్యానించారు.

ప్రజలకు బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన మేలు గురించి వాస్తవాలు చెప్పకపోవడం తమ తప్పేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్నవి మన అందరి ఎన్నికలని అన్నారు. పార్టీ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలని చెప్పారు. ఆదిలాబాద్ లో గెలిచే అవకాశం బీఆర్ఎస్‌కే ఉందని తెలిపారు. కాంగ్రెస్ పై ప్రజలు కోపంతో ఉన్నారని చెప్పారు.

రానున్న రోజుల్లో పార్లమెంట్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలనూ బీఆర్ఎస్ గెలుచుకుంటుందని కేటీఆర్ అన్నారు. పార్టీలోకి నేతలు వస్తారు, పోతారు అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో లేని నేతలు పార్టీని వదిలి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఎన్నికల తర్వాత తెలంగాణలో అతిపెద్ద మార్పు జరగబోతుందని తెలిపారు.

Also Read: ఆ ప్రచారం వల్లే ఎన్నికల్లో దెబ్బతిన్నాం: 10టీవీ ఓపెన్‌ డిబేట్‌లో ఎంపీ అర్వింద్‌

ట్రెండింగ్ వార్తలు