Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగానే ఉంది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి మాగంటి గోపీనాథ్ ను పరామర్శించారు.
మాగంటి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. మాగంటి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. త్వరలోనే మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, రవీందర్ రావు, నాయకులు మాలోతు కవిత, రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఇతర నాయకులు ఉన్నారు.
మాగంటి గోపీనాథ్ గురువారం తన నివాసంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి మాగంటికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిపుణులైన వైద్య బృందం 24గంటలూ మాగంటి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.
గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అమెరికాలో ఉన్న కేటీఆర్ ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి గోపీనాథ్ ను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.