డ్వాక్రా మహిళలకు శుభవార్త.. మరో కొత్త పథకం.. వారి పిల్లల చదువుల కోసం…

ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం కొత్త పథకాన్ని రూపకల్పన చేసింది.

డ్వాక్రా మహిళలకు శుభవార్త.. మరో కొత్త పథకం.. వారి పిల్లల చదువుల కోసం…

Updated On : June 7, 2025 / 11:21 AM IST

AP Govt: ఏపీలోని కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం కొత్త పథకాన్ని రూపకల్పన చేసింది. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా పథకాన్ని రూపొందించింది. వారి పిల్లల విద్యకు తోడ్పాటును అందించేందుకు 4శాతం వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

 

ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11శాతం వడ్డీతో రుణాలిస్తున్నారు. అయితే, డ్వాక్రా మహిళలు తమ పిల్లలను చదివించేందుకు ఎక్కువ వడ్డీలకు అప్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ గుర్తించింది. దీంతో వారికి భారీ ఉపశమనం కల్పించేలా కొత్త పథకాన్ని రూపొందించింది. ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.

 

కూటమి ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పథకం ద్వారా డ్వాక్రా మహిళల పిల్లల చదువుల కోసం సెర్ప్ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు కొత్తగా అమల్లోకి రాబోయే పథకాన్ని వర్తింపజేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తీసుకున్న రుణం మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ పథకంకు ఏడాదికి రూ.200 కోట్లు ఖర్చు చేసేలా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్ని ప్రారంభించేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.