KTR
KTR : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగిన దాడికేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేశారు. దాడికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని సూత్రదారిగా పేర్కొన్న పోలీసులు ఆయన్ను బుధవారం ఉదయం అరెస్టు చేశారు. విచారణ జరిపి.. జైలుకు తరలించారు. అయితే, నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే లగచర్లలో కుట్రకు వ్యూహరచన చేసినట్లు, ఇందుకు తన అనుచరుడు బోగమోని సురేశ్ ను వినియోగించుకొని మిగిలిన నిందితులను రెచ్చగొట్టినట్లు చెప్పినట్లు తెలిసింది. కేటీఆర్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ సంభాషణలు జరిపినట్లు.. అందుకు సంబంధించిన కాల్ డేటాతో పాటు కాల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో కేటీఆర్ ను ఎప్పుడైనా అరెస్టు చేసే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది.
Also Read: కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి అనుమతి దొరికేనా? గవర్నర్ ఢిల్లీ టూర్ ముగిశాక ఏం జరగబోతుంది?
లగచర్లలో అధికారులపై దాడి కేసులో కేటీఆర్ కీలక సూత్రధారి అని పోలీసులు పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. అర్ధరాత్రి సమయంలో కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతోపాటు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఉదయం వరకు కేటీఆర్ ఇంట్లోనే హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
Also Read: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ కీలక నేత పేరు..!
తాజాగా కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ట్వీట్ ప్రకారం.. ఎవరిది కుట్ర..? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!! అంటూ కేటీఆర్ ట్విటర్ లో పేర్కొన్నారు.