వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ కీలక నేత పేరు..!
అన్ని రకాల మద్దతు ఉంటుందని.. తమ పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని ఆదుకుంటారని రైతులకు, నిందితుడు సురేశ్ కు నరేందర్ రెడ్డి హామీ ఇచ్చాడు.

Patnam Narender Reddy Remand Report (Photo Credit : Google)
Patnam Narender Reddy Remand Report : వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన అంశాలను పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ కీలక నేత పేరుని చేర్చారు. బీఆర్ఎస్ ముఖ్య నేత ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగినట్లు పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలనే కుట్ర పన్నారని అందులో వెల్లడించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో బీఆర్ఎస్ ముఖ్య నేతతో పాటు ఇతరుల ఆదేశాలు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు.
కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నిందితుడు విశాల్ తో పాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిగా తేలిందన్నారు. కలెక్టర్ పై దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిది కీలక పాత్రగా తేలిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
”నిందితుడు బోగమోని సురేశ్ ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్ వాష్ చేయించాడు. నిందితులకు ఆర్థిక, నైతిక సాయం సహా అన్ని సౌకర్యాలను అందించాడు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి నిందితుల దృష్టిని మళ్లించాడు. భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని.. లేకపోతే మీ భూములు మీకు దక్కవని రెచ్చగొట్టాడు. అన్ని రకాల మద్దతు ఉంటుందని.. తమ పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని ఆదుకుంటారని రైతులకు, నిందితుడు సురేశ్ కు నరేందర్ రెడ్డి హామీ ఇచ్చాడు.
పట్నం నరేందర్ రెడ్డి నేరపూరిత కుట్రను రూపొందించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డాడు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం 07:02 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నాం. విచారణలో నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడ్డానని నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు.
అలాగే తమ పార్టీ ప్రముఖ నాయకుడి ఆదేశాల మేరకు ఈ కుట్రలకు పాల్పడినట్లు నరేందర్ రెడ్డి చెప్పాడు. రాజకీయ మైలేజీని పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ప్రయత్నించినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు సురేశ్ ను ఫోన్‌లో తరచుగా సంప్రదించి వారి చర్యలను అంచనా వేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. నిందితుడు బి సురేశ్ CDR డేటాలో కూడా ఆధారాలు లభించాయి” అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు.
Also Read : పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.. కాంగ్రెస్ నేతల వీడియోను షేర్ చేసిన కేటీఆర్..