Patnam Narender Reddy Arrest: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.. కాంగ్రెస్ నేతల వీడియోను షేర్ చేసిన కేటీఆర్..

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును

Patnam Narender Reddy Arrest: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.. కాంగ్రెస్ నేతల వీడియోను షేర్ చేసిన కేటీఆర్..

Patnam Narender Reddy Arrest

Updated On : November 13, 2024 / 12:02 PM IST

KTR: వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు అధికారులపై దాడి ఘటనలో ప్రభుత్వం సీరియస్ గా దృష్టిసారించింది. ఈ క్రమంలో దాడి ఘటనలో 16మందిని పోలీసులు అరెస్టు చేసి.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కొడంగల్ కోర్టులో హాజరుపర్చారు. మరో 50 మంది అనుమానితులను పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్న సురేశ్.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేంద్ర రెడ్డి అనుచరుడు. దాడికి ముందు నరేందర్ రెడ్డితో పలు సార్లు సురేశ్ మాట్లాడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి వికారాబాద్ కు తరలించారు. నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని, కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదని అన్నారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరిస్తున్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసింది. ఎంత అణిచివేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే ఆయన్ను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 

కేటీఆర్ ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యపు భూసేకరణను నిరసిస్తూ 16 మంది కొడంగల్ రైతులు జైల్లో ఉండగా.. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టు కాగా.. మహబూబ్ నగర్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లండన్ లో.. సీఎం మహారాష్ట్రలో ఉన్నారు. మంత్రి లండన్ లో బిజీబిజీగా ఉన్నారు.. జైల్లో రైతులు ఉన్నారు. అంటూ కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. జూపల్లి, కాంగ్రెస్ నేతల వీడియోను కేటీఆర్ షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్టుపైన ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే నరేందర్ రెడ్డి సతీమణి శృతితో కూడా కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ లీగల్ సెల్ నరేందర్ రెడ్డి అరెస్టుపైన కోర్టులో పోరాటం చేస్తుందని హామీ కేటీఆర్ ఇచ్చారు.