కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంతో పేదలు తమ సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. పథకం అమలు ప్రక్రియలో కీలకమైన కేంద్ర అనుమతి, పర్యవేక్షణ కమిటీ (సీఎస్‌ఎమ్‌సీ) తాజాగా సమావేశమైంది. ఇందులో 3.52 లక్షలకు పైగా గృహాల నిర్మానానికి ఆమోదముద్ర పడింది.
ఈ పథకం కింద రెండు విభాగాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్ర సర్కారు సహకరిస్తుంది. ఇప్పటికే భూమిని లేదా ఇల్లు ఉన్నవారికి సహాయపడుతుంది. కొత్త ఇంటిని నిర్మించుకోవడం లేదా ప్రస్తుతం ఉన్న ఇల్లును బాగు చేసుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తుంది.
ఇక రెండో విభాగంలో భూమి లేని వారికి ఇల్లు నిర్మిస్తుంది. తక్కువ ధరకు గృహనిర్మాణ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం బిల్డర్లతో భాగస్వామ్యమవుతుంది. దీని కింద ప్రజలకు ఇంటి కోసం కొంత సాయం అందుతుంది. మరికొంత లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది.
ఈ రెండు విభాగాల కింద 3.52 లక్షలకు పైగా ఇళ్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అరుణాచల్ ప్రదేశ్, బిహార్, హరియాణా, జమ్మూకశ్మీర్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లో నిర్మిస్తారు.
ఈ సమావేశం గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ కటికితాలా అధ్యక్షతన జరిగింది. ఈ పథకం మహిళా సాధికారతను ప్రోత్సహిస్తుందని, తాజాగా ఆమోదం తెలిపిన గృహాల్లో ఒంటరి స్త్రీలు, వితంతువులు సహా మహిళలకే 2.67 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరో 90 ఇళ్లను ట్రాన్స్‌జెండర్లను కేటాయిస్తున్నట్లు వివరించారు. ఎస్సీ లబ్ధిదారులకు 80,850 గృహాలను, ఎస్టీలకు 15,928, ఇతర వెనుకబడిన తరగతుల వర్గానికి 2.12 లక్షల ఇళ్లను మంజూరు చేశారు.
ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాదు.. ఈ సారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు దక్కిన వారిలో సీనియర్ నెటిజన్ల (70 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి) కు రూ.30,000 అందిస్తుంది. ప్రతి పెళ్లికాని మహిళకు (40 ఏళ్లు పైబడిన వయస్సు వారికి), వితంతువులకు రూ.20,000 చొప్పున అందిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం ప్రస్తుతం అమలు చేయాల్సిన దశలో ఉంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) అధికారిక వెబ్‌సైట్: https://pmay-urban.gov.in/
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్: https://mohua.gov.in/