తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. కరోనా పాజిటివ్ కేసులు లేకపోతే..దశల వారీగా ఎత్తివేస్తామని ప్రకటించారు. ఇందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రధాన మంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మెజార్టీ సీఎంలు లాక్ డౌన్ కొనసాగించాలనే అభిప్రాయాలు తెలియచేశారని తెలిపారు.
2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. అనంతరం కేసీఆర్ మీడియాతో వివరాలు వెల్లడించారు. 34 మంది (విదేశీయులు)..వీరి ద్వారా సంక్రమించిన వారు ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం సాయంత్రం వరకు 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని..వీరిలో 14 మంది చనిపోయారన్నారు.
96 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. 393 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 1654 మంది క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. 243 చోట్ల కఠినంగా కంటైన్ మెంట్ చేస్తున్నామన్నారు. ఇందులో జీహెచ్ఎంసీ (123) ప్రాంతాలు కూడా ఉన్నాయన్నారు. ఇందులో ఏ ఒక్కరూ సీరియస్ గా లేరని వెల్లడించారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆల్ మోస్ట్ క్లోజ్ అవుతుందని..అనంతరం కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో ఉండదన్నారు సీఎం కేసీఆర్.