ఖమ్మం పార్లమెంట్ బరిలో టీడీపీ? ససేమీరా అంటున్న బీజేపీ సీనియర్లు!

ఖమ్మం పార్లమెంట్ స్థానంను టీడీపీకి కేటాయించాలన్న ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

Khammam MP Seat

Khammam MP Seat : తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీడీపీ పోటీ చేయబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్డీయేలో టీడీపీ చేరిన విషయం తెలిసిందే. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని టీడీపీకి ఇవ్వాలని బీజేపీ అధిష్టానంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను బీజేపీ అధిష్టానం 15 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కేటాయించింది. ఖమ్మం, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టింది. రెండింటిలో ఒకటి టీడీపీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

Also Read : Talaseela Rahuram : మేము సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర.. పూర్తి రూట్ మ్యాప్ రేపు ప్రకటిస్తాం.. : తలశిల రఘురామ్

ఖమ్మం పార్లమెంట్ స్థానంను టీడీపీకి కేటాయించాలన్న ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. బీజేపీ తరపున ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని జలగం వెంకట్రావు ఆశిస్తున్నాడు. ఇటీవలే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. అయితే, పొత్తులో భాగంగా ఎన్డీయే కూటమిలోఉన్న టీడీపీకి ఖమ్మం స్థానాన్ని కేటాయించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీకి షేర్ అయ్యే అవకాశాలు ఉంటాయని కొందరు బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారా? టీడీపీకి కేటాయిస్తే ఎవరు పోటీ చేస్తారు? ఇప్పటికే బీజేపీ నుంచి ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలిచేందుకు సిద్ధమైన వెంకట్రావ్, తదితర బీజేపీ నేతల పరిస్థితి ఏమిటన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇదిలాఉంటే.. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకే బీఆర్ఎస్ పార్టీ మరోసారి టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు