విడదీస్తారనే భయంతో ప్రేమజంట ఆత్మహత్య, వికారాబాద్ లో విషాదం

  • Publish Date - November 5, 2020 / 01:15 PM IST

love couple suicide in vikarabad: వాళ్ల ప్రేమ విఫలం కాలేదు.. పెళ్లి వరకూ వచ్చి ఆగిపోలేదు.. .. ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా రాలేదు.. వారు ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి.. నిలదీశారన్న మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచింది. తమనెక్కడ విడదీస్తారన్న భయంతో పురుగుల మందు తాగి ప్రేమికులిద్దరూ చనిపోయారు. కన్నవారికి అంతులేని శోకాన్ని మిగిల్చారు. బుధవారం(నవంబర్ 4,2020) రాత్రి ఈ విషాద ఘటన జరిగింది.

ఎక్కడ విడదీస్తారన్న భయంతో ఆత్మహత్య:
వికారాబాద్‌ జిల్లాలో టీనేజీ లవ్‌ స్టోరీ విషాదంగా ముగిసింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లికి చెందిన కీర్తన, అదే గ్రామానికి చెందిన బాలరాజు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఇద్దర్నీ ఇంట్లో వాళ్లు నిలదీయడం.. గొడవ కూడా జరగడంతో మరింత మనస్తాపం చెందారు. తమను ఎక్కడ విడదీస్తారన్న భయంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు.

కీర్తన మైనర్:
ప్రేమికులిద్దరూ పురుగుల మందు తాగినట్లు ఇంట్లో వారికి తెలియడంతో ఇద్దర్నీ కాపాడేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే కీర్తన చనిపోయింది. బాలరాజ్‌ ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. వీరిద్దరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ ఘటనలో చనిపోయిన కీర్తన మైనర్‌. విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.