Heavy Rains Alert
Heavy Rains Alert : తెలంగాణలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగస్టు చివరి వారం నుంచి రెండు వారాల పాటు గ్యాప్ ఇచ్చిన వరుణుడు.. రెండు రోజుల నుంచి మళ్లీ తన ప్రతాపం చూపుతున్నాడు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో ఇవాళ (శనివారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: BC Reservations: బీసీ కోటా.. రేవంత్ సర్కార్ సరికొత్త స్కెచ్? రిజర్వేషన్ల దుమారాన్ని సేఫ్‌గా దాటగలదా?
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం కారణంగా రోడ్లపైకి భారీగా వర్షపునీరు చేరి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, శనివారం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల పరిధిలో శనివారం అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆది, సోమ, మంగళ వారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం రికార్డు స్థాయి వర్షపాతంనమోదైంది. ములుగు జిల్లా మల్లంపల్లిలో గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకు 21.7సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో 21.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక మెదక్ లో 19.8 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లిలో 18 సెంటీ మీటర్లు, సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లిలో 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.