×
Ad

Basharath Khan: హైదరాబాద్ లగ్జరీ కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

ఇటీవల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Basharath Khan: లగ్జరీ కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు, కార్యాలయాలు, స్నేహితుల ఇళ్లల్లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు సోదాలు చేస్తున్నారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలు, ఫెమా (ఫారిన్ ఎక్స్ ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్ పై ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకి సంబంధించి తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే బసరత్ ఖాన్ ను అహ్మదాబాద్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ లో లగ్జరీ ఇంపోర్టెడ్ కార్ల విక్రయాల డీలర్ గా బసరత్ ఖాన్ ఉన్నాడు. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు లగ్జరీ కారులను అమ్మాడు. విదేశాల నుంచి లగ్జరీ కార్లను ఇంపోర్ట్ చేసి ట్యాక్స్ ఎగ్గొట్టిన ఆరోపణలపై ఈడీ సోదాలు చేస్తోంది. బసరత్ ఖాన్ ఇల్లు, కార్యాలయాలతో పాటు అతని స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. బసరత్ ఖాన్ ఎవరెవరికి కార్లు అమ్మారనే దానిపై ఈడీ అధికారులు ఆరా తీశారు. FEMA ఉల్లంఘన కేసులోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది. కాగా, కస్టమ్స్ మోసంలో బసరత్ ఖాన్ ను డీఆర్ఐ అరెస్ట్ చేసిన విషయం విదితమే.

బసరత్ ఖాన్ ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారాయన. అక్రమంగా దిగుమతి చేసుకున్న కార్లపై దర్యాప్తు ప్రారంభించాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యను స్వాగతిస్తున్నామన్నారు. చట్ట నియమాలను, ఆర్థిక వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి ఇటువంటి చర్య చాలా ముఖ్యమైనదన్నారు. దేశ ఖజానాకు నష్టం కలిగించిన చర్యలను పరిశీలించాలన్నారు బండి సంజయ్. బసరత్ ఖాన్ దగ్గర కార్లు కొనుగోలు చేసిన వారినీ ఈడీ అధికారులు విచారించాలని బండి సంజయ్ కోరారు.

కాగా, ఇటీవల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లగ్జరీ కార్ల స్కామ్​ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్​ క్రూజర్లను కేటీఆర్​ వాడుతున్నారని ఆయన ఆరోపించారు. అంటే.. స్కామ్​లో కేసీఆర్​ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు అనుమానించాల్సి వస్తుందన్నారు.

ఎవరీ బసరత్ ఖాన్?

”లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్​ దిగుమతి చేసుకున్న ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధర చెల్లించారా? లేదా తక్కువగా చూపించి కొనుగోలు చేయడం జరిగిందా? పేమెంట్లు బినామీ పేర్లతో జరిగాయా? నకిలీ ఆదాయమా? మనీ లాండరింగ్ ద్వారానా? వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలని కోరుతున్నా” అని ట్వీట్​ చేశారు బండి సంజయ్. కేటీఆర్ ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపాయి. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి.

100 కోట్ల రూపాయల కస్టమ్స్ సుంకం ఎగవేత మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో హైదరాబాద్​కు చెందిన లగ్జరీ కార్ల డీలర్, గచ్చిబౌలిలోని ‘హైదరాబాద్ కార్ లాంజ్’ ఓనర్ బసరత్ ఖాన్ ను అహ్మదాబాద్​లో మే 16న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. హమ్మర్ ఈవీ, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి ప్రీమియం మోడళ్లతోపాటు 30కి పైగా లగ్జరీ వాహనాలను బసరత్ ఖాన్ దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బసరత్​ ఖాన్​.. అమెరికా, జపాన్ వంటి దేశాల నుంచి లగ్జరీ కార్లను తెప్పించుకుని శ్రీలంక లేదా దుబాయ్ ద్వారా భారత్ కి మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read: రాజకీయాలకు దూరంగా బండి సంజయ్? ఇలా ఎంతకాలం.. రీజన్ ఏంటి?