ఇక్కడి నుంచి గెలిచిన వారు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.. ఇప్పుడు ఇక్కడ పోటీ ఎలా ఉంది?

ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా కొత్త చరిత్రను నమోదు చేసినట్లే అవుతుంది.

Lok Sabha elections 2024

ఆ లోక్‌సభ స్థానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానం… ఆ సీటులో గెలిచిన వారిలో చాలా మంది కేంద్ర మంత్రులయ్యారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఓ విధంగా చెప్పాలంటే ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఉన్న కానిస్టెస్నీ అది…. అందుకే ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని ప్రధాన పార్టీలు ప్లాన్‌ చేస్తున్నాయి. అసెంబ్లీ ఫలితాల ఊపుతో కాంగ్రెస్‌…. బలమైన ఓటుబ్యాంకుపై ఆశతో బీఆర్‌ఎస్‌…. ప్రధాని మోదీ చరిష్మాయే చుక్కానిగా బీజేపీ దూకుడు చూపుతున్నాయి.. మరి ఈ పోటాపోటీ నియోజకవర్గం ఏది? అక్కడి ఓటర్లు ఎవరికి జైకొడతారు?

కృష్ణా-తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న నేల అది. విభిన్న సంస్కృతులకు సమ్మేళనం… తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిపి ఉండే మహబూబ్ నగర్ పార్లమెంట్‌ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పాలమూరు జిల్లాకు చెందిన లేదా… ఈ ప్రాంతం నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు ఎందరో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకపాత్ర పోషించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ కాగా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొండగల్‌ నియోజకవర్గం ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఇక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికై.. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మాజీ మంత్రులు జైపాల్‌రెడ్డి, మల్లికార్జున్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీలుగా గెలిచిన వారే.

జితేందర్‌రెడ్డి కూడా..
ఇక బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా పనిచేసిన జితేందర్‌రెడ్డి కూడా మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీయే…. ఇలా ఇక్కడి నుంచి ఎన్నికైన నేతలు జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవడంతో ప్రతి ఎన్నిక ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల జోష్‌తో కాంగ్రెస్‌… కంచుకోటను నిలబెట్టుకోడానికి బీఆర్‌ఎస్‌ పోటాపోటీగా తలపడుతుండగా, ఒక్కచాన్స్‌ అంటూ బీజేపీ తరఫున సీనియర్‌ మహిళా నేత డీకే అరుణ గట్టిపోటీ ఇస్తున్నారు. దీంతో అక్కడ ముక్కోణ పోటీ కనిపిస్తోంది.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్లమెంటు సెగ్మెంట్‌లో ఏడు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాలు ఉన్నాయి. షాద్ న‌గ‌ర్, మ‌క్తల్, కొడంగ‌ల్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, నారాయ‌ణ పేట‌, జ‌డ్చర్ల, దేవ‌ర‌క‌ద్ర నియోజ‌క వ‌ర్గాలు ఈ పార్లమెంటు ప‌రిధిలోకి వస్తాయి. మొత్తం 16 లక్షల 75 వేల ఓట్లు ఉన్నాయి. 1957 నుంచి ఇప్పటివ‌ర‌కు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ సార్లు విజయం సాధించింది. గత మూడు సార్లు బీఆర్‌ఎస్‌ పార్టీయే గెలుస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా సిట్టింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు.

ఇక మూడు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో చావోరేవో అన్నట్లు తలపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. మహబూబ్‌నగర్‌లో గెలుపు ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా చాలా ముఖ్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ స్వీప్‌ చేసింది. సుమారు లక్ష ఓట్ల ఆధిక్యం సంపాదించింది. ఐతే ఇప్పుడు రెండు లక్షల ఓట్ల మెజార్టీయే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 6 లక్షల 11 వేల 514 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి 5 లక్షల 11 వేల 17 వచ్చాయి.

డీకే అరుణ నుంచి గట్టిపోటీ
ఇక బీజేపీకి కేవలం లక్ష 12 వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ పరిస్థితుల్లో గెలుపుపై కాంగ్రెస్‌లో ధీమా కనిపిస్తుండగా, వ్యక్తిగత ఇమేజ్‌తో డీకే అరుణ గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆ పార్టీ కూడా కొత్తబలం కూడదీసుకుని పోరాడేందుకు సిద్ధమవుతోంది.

కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి మహబూబ్ నగర్ లో ప్రత్యేక వ్యూహంతో పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిన వంశీచంద్‌రెడ్డి…. అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసేందుకు అవకాశం వచ్చినా వదులుకున్నట్లు చెబుతున్నారు. ఎలాగైనా పార్లమెంట్‌లో అడుగుపెట్టాలనే ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతున్నారు వంశీచంద్‌రెడ్డి. ఇక సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేల దన్నుతో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తాననే ధీమా చూపుతున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని… కాంగ్రెస్‌ గెలిచాక హామీలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు వంశీచంద్‌రెడ్డి….

ఇక బీఆర్‌ఎస్‌ తరఫున మరోసారి పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పార్టీ నుంచి నేతలు వలసలు ఎక్కువగా ఉండటం, ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ముఖం చాటేస్తుండటంతో టికెట్‌ ఖరారు అయినా అడుగు కూడా బయటపెట్టలేదు ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి.

ఇదే సమయంలో గత ఐదేళ్లలో ఎంపీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారనే అపప్రదను మూటగట్టుకున్నారు. కానీ, నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉండటం, గత ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని… ఇది తమ పార్టీకి సహకరిస్తుందనే ఆలోచనలో ఉన్నారు ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి.

మరోవైపు బీజేపీ కూడా ఈ నియోజక వర్గంపై గట్టి ఆశలనే పెట్టుకుంటోంది. ఈ స్థానం నుంచి సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణ రెండోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్‌ దక్కించుకున్నా, గట్టిపోటీ ఇచ్చారు అరుణ. ఇప్పుడు కూడా ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి వెళ్లిపోయినా, వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాడుతున్నారు. మహబూబ్‌నగర్‌ స్థానానికి తానే లోకల్‌ అని… ఈ నియోజకవర్గానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఎలాంటి సబంధం లేదని చెబుతున్నారు డీకే అరుణ.

సీఎం రేవంత్‌రెడ్డిని ఉచ్చులోకి లాగడం ద్వారా తన టార్గెట్‌ ఏంటో స్పష్టం చేస్తున్న డీకే అరుణ… నియోజకవర్గంలో ఉన్న విస్తృత పరిచయాలు, కుటుంబ రాజకీయ నేపథ్యంతో కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అనేస్థాయిలో పోరాటానికి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓట్లు రాకపోయినా, జాతీయ కోణంలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీనే ప్రజలు ఆదరిస్తారని విశ్వసిస్తున్నారు డీకే అరుణ.

మొత్తానికి మూడు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతుండగా, బీఆర్‌ఎస్‌ కూడా పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. గత మూడు ఎన్నికల్లో వరుసగా బీఆర్‌ఎస్‌ గెలవగా, ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా కొత్త చరిత్రను నమోదు చేసినట్లే అవుతుంది….. మరి ఇక్కడ గెలుపు ఎవరిదో జూన్‌ 4నే తేలనుంది.

రూటు మార్చిన రేవంత్ రెడ్డి.. ఈ అస్త్రాన్ని వాడుతున్న సీఎం