రూటు మార్చిన రేవంత్ రెడ్డి.. ఈ అస్త్రాన్ని వాడుతున్న సీఎం
CM Revanth Reddy: సర్వే రిపోర్ట్స్ చూసిన రేవంత్.. గేమ్ ప్లాన్ మార్చేశారు.. జనంలో కొత్త చర్చకు దారి తీసేందుకు..

CM Revanth Reddy
పార్లమెంట్ ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్‌గా మారాయి. పీసీసీ చీఫ్, సీఎం పదవిలో ఉన్న ఆయన మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అందులో పాలమూరు ఎంపీ సీటును అయితే మరీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు రివ్యూ చేసిన రేవంత్.. పరిస్థితి చేయిదాటిపోతుందని గమనించారట. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. గ్రౌండ్‌లో మాత్రం పరిస్థితి వేరేలా ఉందని సర్వే రిపోర్టులు అందాయని టాక్. దాంతో సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నట్లు తెలుస్తోంది.
మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్ కింద ఏడుకు ఏడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ లెక్కన పాలమూరు సీటును పెద్ద కష్టం లేకుండానే గెలవాలి. కానీ సర్వే రిపోర్ట్స్ చూసిన రేవంత్.. గేమ్ ప్లాన్ మార్చేశారు.. జనంలో కొత్త చర్చకు దారి తీసేందుకు సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
వంశీచంద్ రెడ్డిని బరిలోకి..
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని బరిలోకి దింపింది అధిష్టానం. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ బరిలోకి దిగారు. ఆమె గతంలో కాంగ్రెస్‌లో ఉండటం.. ఆ పార్టీ నేతలతో, క్యాడర్ తో మంచి సంబంధాలు కలిగి ఉండటం కాంగ్రెస్‌ను కలవరపెడుతుంది.
సైలెంట్‌గా కాంగ్రెస్ క్యాడర్‌ను తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారని తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా లోపాయికారిగా డీకే అరుణకు మద్దతు ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన రేవంత్ రెడ్డి పదే పదే సమీక్షలు చేస్తూ సెంటిమెంట్ అస్ర్తాన్ని వ్యూహాత్మకంగా వదిలినట్లు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది. తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీన పరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు రేవంత్.
అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరును క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి తడబడుతుంది. పరిస్థితి చేయి దాటుతుండడంతో.. రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి చక్కదిద్దేపనిలో పడ్డారు. మరి సెంటిమెంట్ అస్త్రం పనిచేస్తుందా..? పాలమూరులో పాగా వేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.