Mahesh Kumar Goud
Mahesh Kumar Goud: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు మధ్య చాలా గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్వయంగా పాదయాత్రకు దిగారు. జనరల్‌గా పాదయాత్ర సీఎం కావాలన్న లక్ష్యంతో చేస్తారు. అంతేగాక, ఇదే సమయంలో మహేశ్ కుమార్ గౌడ్ బీసీ సీఎం అని నినాదం ఎత్తుకున్నారు.
ఈ పరిణామాలపై మహేశ్ కుమార్ గౌడ్ 10టీవీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. రేవంత్ రెడ్డి, తాను కలిసి పనిచేస్తే మళ్లీ తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని, అందుకే ఇటువంటి ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. సీనియర్లు అంతా కలిసి తన వెంట ఉండి పాదయాత్ర చేయిస్తున్నారన్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. (Mahesh Kumar Goud)
“అది తప్పు.. పాదయాత్ర రూపకల్పన చేసినప్పుడు రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే, మీనాక్షి, నేను, రేవంత్ రెడ్డి, భట్టి ఆరుగురం ఉన్నాం. పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఒక భాగం. అపోజిషన్‌లో ఉన్నప్పుడే చేయాలని ఏమీ లేదు.
Also Read: నేపాల్ కొత్త పీఎం సుశీల కర్కి సంచలనం.. అల్లర్లు చేసిన వాళ్ల మీద కేసులు
పాదయాత్రలు ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలు ఉంటాయి.. ఉత్పన్నమవుతుంటాయి. పాదయాత్రల వల్ల ప్రజలకి దగ్గర అవుతాం. బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని నేను కొత్తగా తీసుకురాలేదు.
చాలా మంది బీసీ ముఖ్యమంత్రి నినాదంతో కూడా వివాదాలు సూచించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. బీసీ ముఖ్యమంత్రి నినాదం అనేది నా కోసం కాదు. దీనికి అంకురార్పణ చేసింది రాహుల్ గాంధే.
ఈ దేశం మొత్తం చూసుకుంటే బీసీల సంఖ్య గణనీయంగా ఉంది. మన దక్షిణాది రాష్ట్రంలో చూసుకుంటే కేరళలో మెజారిటీ నాయకులు బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. కర్ణాటకలో అయ్యారు.. తమిళనాడులో బీసీలు ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు.
పుదుచ్చేరిలో కూడా బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. మన ఆంధ్ర, తెలంగాణలో కాలేదు కాబట్టి భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న మాట చెప్పాను” అని వివరించారు.