జన్వాడ భూములన్నీ కేటీఆర్‌వే.. ఎవరినైనా సరే వదిలే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

కేటీఆర్, హరీశ్ రావు శకం ముగిసిందని, బీఆర్ఎస్ పార్టీ కూలిపోయే పరిస్థితిలో బీజేపీని పట్టుకొని వేలాడుతోందని..

Mahesh Kumar Goud

తన పేరుమీద ఎలాంటి ఫాంహౌస్‌ లేదని, తన మిత్రుడికి ఉన్న ఫాంహౌస్‌ను లీజుకు తీసుకున్నానని మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇవాళ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..
జన్వాడ భూములన్నీ కేటీఆర్‌వేనని, ఇందులో ఎలాంటి అనుమానమూ అవసరం లేదని తెలిపారు.

కేటీఆర్‌కు పౌరుషం ఉంటే ఫాంహౌస్‌ని కూలగొట్టాలని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎఫ్టీఎల్‌లో ఉన్న ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని, సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. హైడ్రాకు మంచి పేరు వస్తుందని విగ్రహాల పేరుతో కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు.

కేటీఆర్, హరీశ్ రావు శకం ముగిసిందని, బీఆర్ఎస్ పార్టీ కూలిపోయే పరిస్థితిలో బీజేపీని పట్టుకొని వేలాడుతోందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. దురాక్రమణకు గురైన ప్రభుత్వ ఆస్తులని హైడ్రా కాపాడుతుందని స్పష్టం చేశారు. లక్ష చదరపు అడుగుల్లో ఫాంహౌస్ ఉందని, ఎవరైనా భూములను లీజుకు తీసుకుంటారని అన్నారు.

కానీ, కేటీఆర్ మిత్రుడి ఫాంహౌస్‌ని లీజుకు తీసుకున్నానంటూ కొత్త డ్రామాకు తెర లేపారని చెప్పారు. అది కేటీఆర్ ఫాంహౌస్ అని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. అక్రమ కట్టడమని రేవంత్ రెడ్డి ఎన్జీటీకి వెళ్తే అరెస్ట్ చేశారని, జన్వాడ ఫాంహౌస్ భూములన్నీ కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద ఉన్నాయని చెప్పారు.

Also Read: చంద్రబాబుకి ఊరట.. ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ట్రెండింగ్ వార్తలు