Gulzar House Fire: కొన్ని రోజులుగా అదే పని.. ఒక్కసారిగా పేలుడు.. గుల్జార్‌హౌస్‌ ఘోర అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే..

మెట్ల మార్గంలో మంటలు భారీగా ఎగసిపడటంతో లోపలే ఉండిపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మార స్థితిలోకి వెళ్లిపోయారు.

Gulzar House Fire: హైదరాబాద్ గుల్జార్‌హౌస్‌ ఘోర అగ్నిప్రమాద ఘటనకు కారణాలను గుర్తించారు అధికారులు. అగ్ని ప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ప్రమాదం సంభవించిందన్నారు. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఘటన చోటు చేసుకుంది.

కంప్రెషర్ పేలి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో భారీగా పొగ కమ్మేసింది. ఫస్ట్‌, సెకండ్ ఫ్లోర్లలోకి దట్టంగా పొగ కమ్ముకుంది. కుటుంసభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. టెర్రస్‌ నుంచి బయటకు రాలేక కిందకు వచ్చారు. మెట్ల మార్గంలో మంటలు భారీగా ఎగసిపడటంతో లోపలే ఉండిపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మార స్థితిలోకి వెళ్లిపోయారు. గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండటం అత్యంత బాధాకరం.

ఆదివారం తెల్లవారుజామున గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పాతబస్తీలో పెను విషాదాన్ని నింపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అంచనా వేసినా.. తాజాగా ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు తేల్చారు. ఏసీ కంప్రెషర్ పేలి పోవటం వల్లే మంటలు చెలరేగి, క్షణాల్లోనే వ్యాపించినట్లు వెల్లడించారు.

Also Read: సేమ్ ఠాగూర్ సినిమాలో చూపించినట్టే.. మంటల నుంచి కనీసం పిల్లల్నైనా బతికిద్దామని వారిని హత్తుకున్న తల్లి.. కానీ.. ప్రత్యక్ష సాక్షి అది చూసి..

కంప్రెషర్ పక్కనే విద్యుత్ మీటర్లు ఉండటం, చెక్కతో చేసిన మెట్లు కావటం, పార్కింగ్‌లో నిలిపి ఉంచిన వాహనం పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్.. ఇలా అన్నీ భారీ అగ్నిప్రమాదానికి కారణం అయ్యాయి. జీ+2 ఇంట్లో కింది అంతస్తులో ముత్యాల దుకాణం ఉంది. రెండో అంతస్తులో ప్రహ్లాద్ కుటుంబం నివాసం ఉంటుంది.

మెుత్తం 10 గదులు ఉన్నాయి. 8 గదుల్లో ఏసీలు ఉన్నాయి. ఆ ఇంటికి సరైన వెంటిలేషన్ లేకపోవటంతో ఏసీల వినియోగం పెరిగిందని.. ఎండా కాలంలో ఏసీలను విపరీతంగా వాడటం, కంప్రెషర్లు సైతం ఇరుకు సందులోనే బిగించటంతో వాటిపై ఒత్తిడి పెరిగి కంప్రెషర్ పేలినట్లు అధికారులు వివరించారు. హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల్లో ఇంత మంది చనిపోవటం ఇదే తొలిసారి అంటున్నారు.