Devil In Adilabad Tribal Ashram Hostal
Tribal Girls Ashram Hostel : ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో బాలికలు దెయ్యం భయంతో వణికిపోతున్నారు. హాస్టల్‌లో ఏదో ఉందని…తమ ఒంటిపై రక్కుతున్నట్లు…తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు భయంతో వణుకుతున్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం రాత్రి ఒక బాలికకు ఇలా అనిపించటంతో భయంతో కేకలు వేసింది. దీంతో తోటి విద్యార్ధినులు కూడా పెద్ద ఎత్తున కేకలు వేశారు. అందరూ భయంతో ఏడుస్తూ ఒకేసారి బయటకు పరిగెత్తుకు వెళ్ళారు. ఈ క్రమంలో కొందరు బాలికలు కిందపడటంతో వారికి గాయాలయ్యాయి.
విద్యార్ధినుల అరుపులు, కేకలు విన్న గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని వారికి ధైర్యం చెప్పి లోపలకు పంపించారు. గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. హాస్టల్ లో జరిగిన సంఘటనపై గ్రామస్తులు ఉపాధ్యాయులకు సమాచారం అందచేశారు. అయితే వారు ఈ ఘటనపై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు గ్రామస్తులు ఆరోపించారు. దీంతో కొందరు గ్రామస్తులు బాలికలకు ధైర్యాన్ని ఇచ్చేందుకు హాస్టల్ లోనే పడుకున్నారు.
Also Read : Car Accident : హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు
కాగా శనివారం ఉదయం క్లాస్ రూం కు వెళ్లిన విద్యార్ధినులు మళ్లీ భయంతో కేకలు, అరుపులతో ఒకరినొకరు తోసుకుంటూ బయటకు పరుగులు తీశారు. ఈక్రమంలో 50 మంది విద్యార్ధినులకు గాయాలయ్యాయి. స్ధానికంగా ఉన్న ఏఎన్ఎం, మరో ఇద్దరు హాస్టల్ సిబ్బంది వారికి ఎంత నచ్చ చెప్పినా వారు ఏడుపు ఆపలేదు. అప్పటికే అక్కడ జరిగిన విషయాన్ని కొందరు విద్యార్ధినుల తల్లి తండ్రులకు సమాచారం చేరవేశారు. వారు వచ్చి భయపడుతున్న తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లారు.
ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధినుల భయాందోళనల గురించి తెలుసుకున్న ఐటీడీఏ పీఓ అంకిత్ శనివారం రాత్రి గం.8-30కి ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. తమ పిల్లలు దెయ్యం భయంతో వణికిపోతున్నారని… వారిని ఇళ్లకు తీసుకువెళతామని తల్లితండ్రులు పీఓను కోరారు. అందుకు ఆయన అలాంటివి ఏమీ లేవని ముఢనమ్మకాలు పెట్టుకోవద్దని విద్యార్ధినుల తల్లి తండ్రులకు నచ్చచెప్పారు.
కాగా…… ఆశ్రమపాఠశాలలో వార్డెన్ లేరని…. ఆ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావటంలేదని ఇన్ చార్జి హెచ్ ఎం తెలిపారు. వసతి గృహంలో రాత్రి సమయంలో ఏఎన్‌ఎం, నైట్ డ్యూటీ వాచ్‌మన్ విధుల్లో ఉన్నారు. అయినా పిల్లలు భయపడ్డారని…. ఆస్పత్రిలో ఉన్న పిల్లలకు ధైర్యం చెప్పి తిరిగి హాస్టల్‌కి పంపించామని ఆశ్రమ పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం భాస్కర్ చెప్పారు.