Gas EKYC : తీవ్ర విషాదం.. వ్యక్తి ప్రాణం బలిగొన్న వంట గ్యాస్ ఈ-కేవైసీ
నిన్న సాయంత్రం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నాడు. కానీ, ఈ-కేవైసీ పూర్తి కాలేదు. తనతో పాటు వచ్చిన కుమారుడిని ఇంటికి పంపించి ఏజెన్సీ సమీపంలోనే పోశెట్టి ఉండిపోయాడు.

Gas EKYC (Photo : Google)
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంట గ్యాస్ ఈ-కేవైసీ ఓ వ్యక్తి ప్రాణం బలిగింది. ఆదిలాబాద్ నాయక్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ-కేవైసీ చేయించుకోవటానికి వచ్చిన వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని సిరికొండకు చెందిన అంగు పోశెట్టిగా గుర్తించారు. వంట గ్యాస్ కనెక్షన్‌కు ఈ-కేవైసీ చేయించుకోవడానికి ఆ వ్యక్తి శనివారం ఆదిలాబాద్ కి వచ్చాడు.
నిన్న సాయంత్రం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నాడు. కానీ, ఈ-కేవైసీ పూర్తి కాలేదు. తనతో పాటు వచ్చిన కుమారుడిని ఇంటికి పంపించి ఏజెన్సీ సమీపంలోనే పోశెట్టి ఉండిపోయాడు. అయితే, రాత్రి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అతడి కోసం పలుచోట్ల గాలించారు. చివరికి గ్యాస్ ఏజెన్సీ వద్ద చూడగా పోశెట్టి మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : సెల్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడాలా? జస్ట్ బ్లాక్ వాల్ పేపర్ సెట్ చేసుకోండి చాలు..
కాగా.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పొందాలనుకునే వారు కచ్చితంగా ఈ-కేవైసీ చేసి ఉండాలి. దీంతో వినియోగదారులు మీ సేవా కేంద్రాలు, గ్యాస్ ఏజెన్సీల ఆఫీసుల ముందు బారులు తీరుతున్నారు. అక్కడ పెద్ద పెద్ద క్యూలైన్స్ ఉండటంతో గంటల తరబడి నిల్చోవాల్సి వస్తోంది. ఒక్కోసారి రెండు మూడు రోజుల సమయం పడుతోంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, వంట గ్యాస్ ఈ-కేవైసీ అనేది ఇంటి నుంచే పూర్తి చేయవచ్చని, ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలియక చాలా మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వంట గ్యాస్ సిలిండర్ ఈకేవైసీకి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్‌ల వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచించారు. కేవైసీ కోసం గుంపులుగా ఆఫీసులకు వచ్చి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేశారు. డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా కేవైసీని పూర్తి చేయొచ్చన్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో అక్కడ కేవైసీ పూర్తి కాని వారే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్లాలని కోరారు.
Also Read : పచ్చి మిరపకాయ ప్రమాదక వ్యాధుల నుండి కాపాడుతుందని మీకు తెలుసా?
అంతేకాదు.. గ్యాస్ కేవైసీకి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిందని, వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.500లకే సిలిండర్ హామీకి, ఈ కేవైసీకి సంబంధం లేదన్నారు. ఆ హామీ అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని తేల్చి చెప్పారు.
కాగా, కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ పథకం ఒకటి. అయితే, ఈ కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రచారం జరగడంతో వినియోగదారులు కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కట్టారు. తెలంగాణ వ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీ ఏర్పడింది. రోజుల తరబడి వినియోగదారులు ఉదయం నుంచి సాయత్రం వరకు గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. పనులన్నీ పక్కన పెట్టి మరీ గ్యాస్ పాస్ బుక్, ఆధార్ కార్డులతో గంటల తరబడి లైన్లలో నిల్చుంటున్నారు. దీంతో కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. అయితే, ఈ కేవైసీ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అని.. 500 రూపాయలకే గ్యాస్ పథకానికి, దీనికి ఎలాంటి సంబంధం లేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. అయినా కొందరు వినియోగదారుల్లో ఆందోళన పోవడం లేదు.
ఇకపోతే.. గ్యాస్ ఏజెన్సీలకు లేదా మరో చోటికి వెళ్లాల్సిన పని లేకుండానే ఇంటి నుంచి కూడా ఆన్ లైన్ లో E-KYC పూర్తి చేయొచ్చు. ఇది చాలా తేలిక.
* ముందుగా www.mylpg.in సైట్ లోకి వెళ్లండి. ఇది ఎల్పీజీ గ్యాస్ అధికారిక వెబ్‌సైట్.
* అక్కడ కుడివైపున భారత్ గ్యాస్/HP గ్యాస్/ఇండేన్ సిలిండర్ ఉన్న ఆప్షన్ కనిపిస్తుంది. కావాల్సిన దానిపై క్లిక్ చెయ్యాలి.
* ఆ తర్వాత రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్‌తో సైన్ ఇన్ అవ్వాలి. లేదంటే న్యూ యూజర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
* అక్కడ మీ KYC అప్ డేట్ అయ్యిందో లేదో చూసుకోవచ్చు.
* లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ పై మీ గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
* ఎడమ వైపు కనిపించే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
* మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి అథెంటికేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు విజయవంతంగా అథెంటికేషన్ పూర్తియినట్లు మెసేజ్ వస్తుంది.
* మీరు ఓసారి స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ పై మరోసారి క్లిక్ చేయండి. అప్పుడు ఇ-కేవైసీ ఇప్పటికే పూర్తి చేశారు అనే మెసేజ్ వస్తుంది.
* ఒకవేళ మీ వివరాలు కనిపించకపోతే, మీరు Need KYCపై క్లిక్ చెస్తే, KYC ఫారమ్ వస్తుంది. దాన్ని ఫిలప్ చేసి, మీరు గ్యాస్ పొందుతున్న ఏజెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్‌లో గానీ లేదా ఫారమ్ ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత నాలుగైదు రోజుల్లో మీ KYC ప్రాసెస్ పూర్తవుతుంది.