Mohan Babu
Manchu Family Dispute: సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గత మూడు రోజులుగా వివాదం కొనసాగుతుంది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం, పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావటం జరిగాయి. తాజాగా పోలీసులు మోహన్ బాబుకు బిగ్ షాకిచ్చారు. జర్నలిస్ట్ పై దాడి కేసు ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై పోలీసులు బీఎస్ఎన్ 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే, బుధవారం మోహన్ బాబుపై 118 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని సెక్షన్ ను మార్చారు.
గత మూడు రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో హైదరాబాద్ లోని జల్ పల్లి లో మోహన్ బాబు నివాసం వద్ద ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంట్లోకి ఆయన చిన్నకుమారుడు మనోజ్, మౌనిక దంపతులు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మనోజ్ దంపతులు బలవతంగా గేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు.. ఈ క్రమంలో కవరేజీ కోసం లోపలికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఓ మీడియా ప్రతినిధి వద్ద మైకును లాక్కొని ఆ మైకుతో మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. దీంతో అతనికి గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడమేకాకుండా.. ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపట్ల మోహన్ బాబు తీరును ఖండిస్తూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. జర్నలిస్టుపై దాడిచేసిన అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై బుధవారం 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే, తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆయనపై మీఎన్ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.