Manda Krishna: మోదీని పట్టుకుని భోరున విలపించిన మంద కృష్ణ

మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీని పట్టుకుని భోరున విలపించారు.

Manda Krishna Madiga: ప్రధాని నరేంద్ర మోదీ సభలో మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో శనివారం సాయంత్రం జరుగుతున్న సభలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. వేదిక పైకి రాగానే మంద కృష్ణను ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత సభకు హాజరైన వారికి అభివాదం చేశారు. వేదికపై ప్రధాని పక్కనే కూర్చున్న మంద కృష్ణ ఒక్కసారి భావోద్వేగానికి లోనయ్యారు. మోదీ భుజంపై వాలి ఆయన రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనను మోదీ ఓదార్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్, డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు వేదికపై ఆశీనులయ్యారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ మంద కృష్ణ
విద్య, ఉద్యోగాల్లో మాదిగలు వెనుకబడ్డారని మంద కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయం పేరుతో ఈ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. మాదిగలను కేసీఆర్ అణచివేశారని, మోదీ పైకి తీసుకొచ్చారని అన్నారు. కేసీఆర్ కేబినెట్ లో 18 మంత్రులంటే ఒక్క మాదిగ కూడా లేరని తెలిపారు. ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేసిన ఘతన మోదీకే దక్కుతుందన్నారు. తమ వాటా తమకు దక్కాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు. దళితుల్లో ఉండే అన్ని కులాలకు న్యాయం జరగాలని కోరారు. తమకు న్యాయం చేస్తే పార్టీలకు అతీతంగా మాదిగలంతా మోదీకి మద్దతు తెలుపుతారని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు