Congress Party: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం.. తెలంగాణ, ఏపీలకు కొత్త ఇన్‌చార్జ్‌ల నియామకం

గోవా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చూస్తున్న మాణిక్యం ఠాగూర్ ను ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

AP and Telangana Congress Party

Telangana Congress Party : వచ్చేఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. విజయమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులను చేపట్టింది. 12 మంది ప్రధాన కార్యదర్శులతోపాటు 11 రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న మాణిక్ రావ్ ఠాక్రేను తొలగించి దీపాదాస్ మున్షీకి తెలంగాణ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను ఏఐసీసీ అప్పగించింది. మరోవైపు ఏపీపైనా కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించిన విషయం తెలిసిందే. మరికొద్ది నెలల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. మాణిక్యం ఠాగూర్ కు ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించింది. ఇదిలాఉంటే.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ పార్టీ ఇన్‌చార్జ్‌లను కాంగ్రెస్ అదిష్టానం మార్చింది. యూపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండటంతో ఆమెకు నిర్దిష్ట బాధత్యలు అప్పగించలేదు. ప్రియాంక స్థానంలో యూపీ బాధ్యతలను మహారాష్ట్రకు చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండేకు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది.

Also Read : 2024 Lok Sabha elections : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓటు షేర్ లక్ష్యంగా బీజేపీ క్లస్టర్ సమావేశాలు

తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న మాణిక్ రావ్ ఠాక్రేను తొలగించడం కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయనే పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా కొనసాగుతారని అందరూ భావించారు. కానీ, లోక్ సభ ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ సంస్థాగతంగా మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఠాక్రేకు తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పిస్తూ గోవా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించింది. అతని స్థానంలో కేరళ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న దీపాదాస్ మున్షీకి తెలంగాణ ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి  ఇన్ ఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో ఏఐసీసీ ముఖ్య పరిశీలకురాలిగా వచ్చిన ఆమె అసంతృప్తులను బుజ్జగించడం, వారికి హామీలు ఇవ్వడం వంటివి చేశారు. ఫలితంగా ఆమెకు ఇక్కడి పరిణామాలన్నింటిపైనా అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు పూర్తిస్థాయి ఇన్ చార్జిని నియమించే వరకూ అదనపు బాధ్యతలను దీపాదాస్ మున్షీ నిర్వహిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Also Read : AP Assembly Elections 2024: నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలపై కత్తిరింపుల కత్తి

గోవా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చూస్తున్న మాణిక్యం ఠాగూర్ ను ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రావడంతో ఏపీపై దృష్టి కేంద్రీకరించింది. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే గతంలో తెలంగాణ ఇన్ చార్జి బాధ్యతలు నిర్వర్తించిన మాణిక్కం ఠాగూర్ కు ఏపీ పార్టీ ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించింది. ఠాగూర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత, మరోవైపు తెలంగాణలో పార్టీ ఇన్ చార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. ఏపీలోని పలు పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఠాగూర్ ను ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించినట్లు తెలుస్తోంది.